ఎంత కష్టం..ఎంత కష్టం..

20:44 - December 15, 2016

50రోజుల దిశగా దేశం పరిగెడుతోంది. ఇప్పటికి 35 రోజులు దాటాయి.. కానీ, ఫలితం ఏంటి? పరిస్థితి మరింత విషమిస్తోంది. క్యూలో నిలబడ్డ దేశం నిరాశగా చూస్తోంది. కరెన్సీ సర్జికల్ స్ట్రైక్స్ తో కూలిన బతుకులు అడుగడుగునా కనిపిస్తున్నాయి. చేతిలో చిల్లిగవ్వలేక ఎలా బతకాలో తెలియక అల్లకల్లోలమవుతున్నారు. ఈ పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు..? ఈ దుస్థితి మారేదెపుడు? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. సర్కారుదేముంది ఓ ప్రయోగం చేసింది. రెండ్రోజుల్లో సర్దుకుంటుందని చెప్పింది. కానీ, నెలదాటినా మార్పులేదు. అసలెన్ని నెలలకు ఈ పరిస్థితి మారుతుందో తెలియక సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. పనులు మానుకుని బ్యాంకుల చుట్టూ ఇంకా ఎన్నాళ్లు తిరగాలా అని విలపిస్తుంటున్నాడు? నల్లధనం అన్నారు.. నకిలీ నోట్లన్నారు.. నాలుగు రోజులే అన్నారు. ఆఖరికి క్యాష్ లెస్ గా మారాల్సిందే అంటున్నారు. కానీ, బ్యాంకులు లేవు.. ఆన్ లైన్ పరిజ్ఞానం లేదు. చేతిలో పైసా లేదు. కనీస అవసరాలకు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ప్రజలున్నారిపుడు. మరి ఇప్పుడు సాధించేదిమిటి? దేశానికి ఎలాంటి మేలు జరిగింది? వెనక్కి తీసుకున్న కరెన్సీ కొండంత.. రిలీజ్ చేసింది నలుసంత.. అక్రమార్కులతో బ్యాంకు సిబ్బంది కుమ్మక్కైన సందర్భాలు కనిపిస్తున్నాయి.

మరో పక్క కమీషన్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. పాత నోట్లు మార్చటానికి కమీషన్.. కార్డు స్వైప్ చేస్తే కమీషన్.. ఇవన్నీ అడుగడుగునా.. సామాన్యుడిని నానాఇబ్బందులకు లోను చేస్తున్నాయి. అంతా మీ మంచికే అన్నారు. హామీలు ఇచ్చారు. కానీ జరుగుతున్నది శూన్యం.. వివరాలు చిన్న బ్రేక్ తర్వాత..రెండు మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుందన్నారు..రెండు వారాలన్నారు..యాభై రోజులంటున్నారు.. ఎంత కాలం? ఎన్నాళ్లకు పరిస్థితి మారుతుంది? ప్రభుత్వమే సృష్టించిన కరెన్సీ కొరత ఇప్పుడు దేశాన్ని ఏ పరిస్థితిలోకి తీసుకెళ్లనుంది? అంతా మీమంచికే అంటారు..హామీలు చాలా ఇస్తారు.. బ్యాంకుల్లో క్యాష్ రెడీ అవుతోంది అంటారు.. ఏటీఎంలు సిద్ధం చేస్తున్నామంటారు.. అన్నీ మాటలకే పరిమితం.. చేతల్లో జరుగుతున్నది శూన్యం.. ఒకటి రెండు రోజులు కాదు.. 35 రోజుల వ్యధ ఇది. మరెన్ని రోజులు భరించాలో తెలియని బాధ ఇది. ఎందుకీ ఖర్మ అని ప్రశ్నలు.. తమ సొమ్ము తాము తీసుకోలేని పరిస్థితిలో, క్యాష్ లెస్ దిశగా సిద్ధంగా లేని సామాన్యులు సర్కారుకు అనేక ప్రశ్నలు సంధిస్తున్నారు. ఓ పక్క అక్రమార్కుల చేతిలో కొత్త నోట్ల కట్టలు, కమీషన్ దందాలు అడుగడుగునా కనిపిస్తుంటే ఈ డీమానిటైజేషన్ దేశాన్ని ఇంకెన్ని సమస్యల్లోకి నెట్టనుందో అనే ఆందోళన వ్యక్తమౌతోంది. ఈ అంశంపై మరింత సమాచారానికి వీడియో చూడండి..

Don't Miss