అన్నాడీఎంకేను నడిపించే వారెవరు ?

20:21 - December 6, 2016

చెన్నై : తమిళనాట జయలలిత తర్వాత అంతే సమర్థంగా అన్నాడీఎంకేను నడిపించే నాయకుడెవరు? జయకు వారసులుగా ఎవరు ఉండబోతున్నారు? ప్రస్తుతానికి పన్నీరు సెల్వంను సీఎంగా ప్రకటించినా రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయా? పన్నీరు సెల్వం సీఎంగా కొనసాగేందుకు జయలలిత సహచరి శశికళ సహకరిస్తుందా? లేక అధికారపీఠాన్ని దక్కించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుందా? అన్నాడీఎంకేకు బలమైన నాయకత్వం కావాలంటే సినీ హీరో అజిత్‌ అమ్మకు వారసుడిగా రానున్నారా? అమ్మ మృతితో.. తమిళనాడు అంతటా ఇదే చర్చ సాగుతోంది.

సీఎంగా పన్నీర్ సెల్వం..
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం.. ఆమె వారసుడెవరు అన్న అంశాన్ని తెరపైకి తెచ్చింది. సీఎంగా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టినప్పటికీ..ఆయన జనాకర్షక నేత కాకపోవడంతో పార్టీ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలోనే మూడు అధికార కేంద్రాలు నడిచాయనే ప్రచారం ఉంది. జయలలిత సహచరి శశికళ... నెంబర్‌ టూ గా వ్యవహరించారు. ఇప్పుడు, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక వ్యవహారంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది.

అనేక ప్రశ్నలు..
పోరాట యోధురాలిగా, అత్యంత ప్రజాకర్షణ ఉన్న నేతగా ఉన్న జయలలిత స్థానంలో.. ఆమె వారసుడిగా పన్నీరు సెల్వంను అటు ప్రజలు, ఇటు పార్టీ నాయకులు ఎంత వరకూ అంగీకరిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి. కోర్టు కేసులు, వివిధ కారణాలతో జయ అధికారానికి దూరంగా ఉన్నప్పుడు పన్నీరు సెల్వం రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జయ ఆస్పత్రిలో ఉన్నప్పుడు జయ మంత్రిత్వ శాఖల బాధ్యతలన్నీ ఆయనే చూశారు. రాష్ట్రంలో ప్రధాన అధికార కేంద్రంగా ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లకు గాను..136 స్థానాలతో అన్నాడీఎంకే పూర్తి మెజారిటీ సాధించింది. అయితే, శశికళ కోటరీలో 60 మంది ఎమ్మెల్యేలు, 12 మంది మంత్రులు ఉన్నట్లు తెలుస్తోంది. పన్నీరు సెల్వంను శశికళ తాత్కాలికంగా సీఎంగా అంగీకరించినా, రాబోయే రోజుల్లో రాజకీయ సమీకరణాలు భారీగా మారతాయని రాజకీయ విశ్లేషకుల భావన. ప్రధానంగా, శశికళ, పన్నీరు సెల్వం మధ్య పోరు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

షీలా బాలకృష్ణన్..
అన్నాడీఎంకే రథసారథి రేసులో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్‌ పేరు వినిపిస్తోంది. జయలలిత సలహాదారుగా ఉన్న షీలా బాలకృష్ణన్‌.. పాలనపరంగా వ్యవహారాలన్నీ చూశారు. అదే సమయంలో, పన్నీరు సెల్వంను జయలలిత విశ్వసించినట్లుగా శశికళ ఏ మాత్రం నమ్మరు. పన్నీరు సెల్వం కంటే కూడా ఆమె మాజీ సీఎస్‌ షీలా బాలకృష్ణన్‌ తెరపైకి తీసుకురావడానికే మొగ్గు చూపుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సినీ హీరో అజిత్..
జయలలిత వారసుడిగా సినీ హీరో అజిత్ పొలిటికల్‌ ఎంట్రీ ఇస్తారనే ఊహాగానాలు కూడా ఇప్పుడు జోరందుకున్నాయి. సినీ హీరో అజిత్‌ జయకు అత్యంత సన్నిహిత బంధువు. జయలలితను అమ్మగా పిలుస్తూ ఆమెతో ఆప్యాయంగా ఉండేవాడు. డీఎంకేకు గట్టి పోటీ ఇవ్వాలన్నా..అజిత్ వంటి ప్రజాకర్షణ గల వ్యక్తిని వారసుడిగా తెరపైకి తీసుకు రావడమే మంచిదనే అభిప్రాయాలను అన్నాడీఎంకే వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తన మరణానంతరం పన్నీరు సెల్వం ముఖ్యమంత్రిగా ఉండాలని, తదుపరి ఎన్నికలు వచ్చే నాటికి అజిత్‌ను నాయకుడిగా తయారు చేయాలని పార్టీ వర్గాలను జయ ఆదేశించారన్న వార్తలు వస్తున్నాయి.

బీజేపీ బలం నామమాత్రమే..
రాబోయే ఆరు నెలల వరకూ పన్నీరు సర్కార్‌కు వచ్చిన ప్రమాదమేమీ లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. మరోవైపు తమిళనాడులో బీజేపీ బలం నామమాత్రమే. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక.. దక్షిణాదిలో పార్టీని బలపరచాలన్న కసరత్తులో తమిళనాడు మీద కమలనాథులు కన్నేశారు. ఓవైపు సీఎం జయలలితకు స్నేహ హస్తం అందిస్తూనే.. మరోవైపు తమిళనాడులో పార్టీకి బలమైన పునాదులు వేసే ప్లాన్‌ చేశారు. జయలలిత తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ప్రధాని మోదీ మొదలు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తమిళిసై సౌందర్ రాజన్ దాకా బీజేపీ అగ్ర నేతలు జయకు అందుతున్న వైద్య సేవల పట్ల అత్యంత శ్రద్ధ కనపరిచారు. ఇలాంటి చర్యల ద్వారా అన్నాడీఎంకేకు చాలా దగ్గరై భవిష్యత్ రాజకీయాలు నడపాలన్నదే బీజేపీ వ్యూహం అని తెలుస్తోంది. ఈ సమీకరణల్లో భాగంగానే పన్నీర్ సెల్వంతో బీజేపీ పెద్దలు తరచూ టచ్‌లో ఉంటున్నట్లు తెలుస్తోంది. రాబోయే 6 నెలల్లో అన్నాడీఎంకేలో ఎలాంటి రాజకీయ సమీకరణాలు మారుతాయన్నది తమిళనాట హాట్‌ టాపిక్‌గా మారింది.

Don't Miss