విద్యుత్ కోత..తాగునీటి కరవు..

14:59 - December 3, 2016

యాదాద్రి భువనగిరి : తెలంగాణ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసినా కొన్ని ప్రాంతాల్లో తాగడానికి గుక్కెడు నీరు దొరకని పరిస్థితి.. తాగడానికి నీరు లేక పంటలు పండక గ్రామాల ప్రజల విలవిలలాడిపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో దిక్కుతొచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యుత్‌ కొరత లేదని బల్ల గుద్ది చెబుతున్న నేతలు ఈ గ్రామానికి వెళ్తే ముక్కున వేలేసుకోకతప్పదు. భూగర్భ జలాలు పుష్కలంగ ఉన్నా తాగడానికి గుక్కెడు నీరు పొందలేని గ్రామస్ధుల ధీన గాధపై ప్రత్యేక కథనం.రాష్ట్రమంతటా పుష్కలంగా నీరు ఉన్నా ఈ గ్రామంలోని ప్రజల దాహాం తీరడం లేదు. రాజధాని హైదరాబాద్‌ కు కూత వేటు దూరంలో ఉన్న యాదాద్రి భువగిరి జిల్లా రాజాపేట మండలం కొండేరు చెర్వు మధిర గ్రామంలోని మారుమూల పుట్టగూడెం గిరిజన తండాలో మంచినీరు అందక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

15 రోజులుగా విద్యుత్‌లో ఓల్టేజీ సమస్య
భూగర్భ జలాలు ఉన్నా విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం వారి పాలిట శాపంగా మారింది. గత 15 రోజులుగా విద్యుత్‌లో ఓల్టేజీ సమస్యతో బోరు పంపు మోటరు పని చేయడం లేదని ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యం అని గ్రామస్థులు వాపోతున్నారు. చేసేది లేక నిత్యావసరాలు, మంచినీటి కొరకు వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నా యజమానులు నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు తమ గోడును స్థానిక ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

విద్యుత్‌ అధికారులు నిర్లక్ష్యం
ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తాగు నీటి సమస్యను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఫీడర్‌ ఛానల్‌ వల్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్‌ అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఏదీ ఎమైనా విద్యుత్‌ సమస్యను పరిష్కరించి గ్రామస్థుల దాహర్తిని తీర్చాల్సిన అవసరం విద్యుత్‌ అధికారులపై ఎంతైనా ఉంది. 

Don't Miss