ఎంపీ 'కవిత పేరు'తో గ్రామం!..

07:52 - December 8, 2016

నిజామాబాద్ : ఇప్పటివరకు ఆ గ్రామం పేరు ఖానాపూర్‌. ఇక ముందు మాత్రం ఆ ఊరి పేరు కవితాపూర్‌. కవిత అంటే కల్వకుంట్ల కవితేనా...? అవును అక్షరాలా మీరూహించింది కరెక్టే. ఎంపీ కవిత పేరు మీదుగా నిజామాబాద్‌ జిల్లాలోని ఖానాపూర్‌ పేరును కవితాపూర్‌గా మార్చారు. ఇంతకీ ఎందుకలా విలేజ్‌ పేరు మార్చాలని నిర్ణయించారు...? ఖానాపూర్‌ కాస్త..కవితాపూర్‌గా మారడంలో కహానీ ఏంటీ..? ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తోంది.

ఖానాపూర్‌ను కవితాపూర్ గా పేరు మార్పు
ఈ ఊరి పేరు ఖానాపూర్‌. నిజామాబాద్‌ జిల్లాలోని ఆర్మూర్‌ మండలంలోని ఈ గ్రామం ఉన్నట్టుండి వార్తల్లోకెక్కింది. ఇప్పటివరకు ఖానాపూర్‌గా ఉన్న ఈ గ్రామం.. ఇక కవితాపూర్‌గా పిలుచుకోవాలని గ్రామస్తులు నిర్ణయించారు. నిర్ణయించిందే తడవుగా ఓ బ్రోచర్‌ను కూడా రూపొందించి ఎంపీ కవిత చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు.

గ్రామం పేరు మార్చేందుకు గ్రామస్థుల నిర్ణయం...
ఖానాపూర్‌ గ్రామాన్ని కవితాపూర్‌గా మార్చడానికి ఓ కారణమూ ఉంది. అదేంటంటే.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో భాగంగా గతంలో తమ గ్రామం ముంపు గ్రామంగా ఉండటంతో నాడు ఇళ్లు కోల్పోయిన వారికి అప్పటి ప్రభుత్వాలు ఏళ్లు గడిచినా ఇళ్లు కేటాయించలేదు. కాంగ్రెస్‌ హయాంలో నాయకుల చుట్టూ తిరిగిన గ్రామస్తులు ఇళ్ల స్థలాలు మాత్రం సాధించుకోలేక పోయారు. ప్రభుత్వం మారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడటంతో.. ఎంపీ కవిత చొరవతో ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయి. దీంతో గ్రామస్థులంతా ఆనందం వ్యక్తం చేస్తూ.... తమ గ్రామం పేరు మార్చేందుకు నిర్ణయించారు.

గ్రామస్తుల కోరిక మేరకు కవిత అంగీకారం.. బ్రోచర్‌ను ఆవిష్కరణ
ఖానాపూర్ గ్రామాన్ని ఇక నుంచి కవితాపూర్‌గా మార్చుకుంటామని గ్రామానికి చెందిన నాయకులు, వీడీసీ సభ్యులు, ఇళ్ల స్థలాల కమిటీ సభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లి ఎంపీ కవితను కూడా కలిశారు. గ్రామస్తుల కోరిక మేరకు ఎంపీ కవిత, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి గ్రామ పేరు మార్పునకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక గ్రామంలో 274 ఇళ్ల స్థలాలను ప్రభుత్వమే ఇచ్చిందని.. కాంగ్రెస్ హయాంలో ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నో సార్లు వారి చుట్టు తిప్పించుకున్నారని ఆ గ్రామస్తులు వాపోయారు.

కవితే మా ఆరాధ్య దేవత : గ్రామాస్తులు
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఏళ్ల నుంచి ఆశగా ఎదురు చూసిన సమస్యను ఎంపీ కవిత నెరవేర్చటంతో గ్రామస్తులంతా తమ ఆరాధ్య నేత పేరునే తమ ఊరికి పెట్టుకోవాలని నిర్ణయించారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు గ్రామస్తులు పేరు మార్పు బ్రోచర్‌ను ఎంపీ కవితకు సమర్పించారు. దీంతో వారి కోరికను కాదనలేకపోయారు ఎంపీ కవిత.

 

Don't Miss