మిషన్ భగీరథ పనుల పురోగతిపై సమీక్ష..

08:47 - December 4, 2016

హైదరాబాద్ : ఈ నెల మూడో వారం నాటికి పంట భూముల్లో మిషన్ భగీరథ పైప్ లైన్‌లు వేయడం పూర్తి కావాల్సిందేనని వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి ఆదేశించారు. భగీరథ పనులతో అన్నదాతల పంటలకు నష్టం జరగొద్దన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా నాట్లు పడకముందే పైప్ లైన్ లు వేయాలన్నారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై సచివాలయంలో అధికారులు, కన్సల్టెంట్ లతో ప్రశాంత్‌ రెడ్డి సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. 
నిర్లక్ష్యాన్ని సహించేదన్న ప్రశాంత్ రెడ్డి 
సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథలో చిన్నపాటి నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదని వైస్‌ ఛైర్మన్‌ వేముల ప్రశాంత్‌ రెడ్డి తేల్చి చెప్పారు. అధికారులు ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షలకు కూడా వెనుకాడేది లేదని హెచ్చరించారు. మెదక్, ఖమ్మం సెగ్మెంట్ పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయన్న ఆయన..మిగతా సెగ్మెంట్ లలో కూడా వేగం పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా కొన్ని జిల్లాల్లో ఇసుక కొరతతో పనులు ఆశించినంత వేగంగా జరగడం లేదని చీఫ్ ఇంజనీర్లు ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సంబంధిత మంత్రితో మాట్లాడుతానని వైస్ ఛైర్మన్ హామీ ఇచ్చారు.
ఓహెచ్ బీఆర్ లపై మరింత దృష్టి 
పనుల విభజనతో పాటు కాంట్రాక్టర్ల మధ్య లేబర్ విభజన కూడా జరగడం.. నోట్ల రద్దు ప్రభావం.. భగీరథపై పడలేదన్నారు. ఇంటెక్ వెల్స్ అన్నీ సేఫ్ స్టేజ్ కు వచ్చినందున ఇక ట్రీట్ మెంట్ ప్లాంట్.. ఓహెచ్ బీఆర్ లపై మరింత దృష్టి పెట్టాలన్నారు. వాటితో పాటు పైప్ లైన్ పనులను త్వరగా చేయాలన్నారు. భగీరథలో ఎన్ని కిలోమీటర్ల మేయిన్ పైప్ లైన్ వేయాలో.. పంట భూముల్లో ఎన్ని కిలోమీటర్లు వేయాలనేది ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. 
ఓహెచ్ బీఆర్ లపై మరింత దృష్టి పెట్టాలన్నారు
యాక్షన్ ప్లాన్ ను రూపకల్పన 
డిసెంబర్ 2017 నాటికి అన్ని గ్రామాలకు సురక్షిత మంచినీటిని అందించాలంటే ఈ నెల మూడో వారం నాటికి పంట భూముల్లో పైప్ లైన్ లు వేయడం పూర్తి కావాల్సిందే అన్నారు. అందుకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. ఏఈఈల నుంచి పంట భూముల సమాచారం తెప్పించుకుంటే పని సులభంగా అవుతుందని సూచించారు. అవసరమైతే వేరే ప్రాంతాల్లో వేయాల్సిన పైప్ లైన్ పనులను కొన్ని రోజుల పాటు నిలిపివేసి, పంట భూములపై ఫోకస్ చేయాలన్నారు. ఈ విషయంలో వర్క్ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని మానిటర్ చేయాలని ఈఎన్ సి సురేందర్ రెడ్డిని కోరారు. త్వరలోనే తాను వారంలో రెండు రోజులు ఫీల్డ్ విజిట్ చేస్తానని ప్రశాంత్ రెడ్డి చెప్పారు. ఇంటింటికి నల్లాతో పాటు ఇంటింటికి ఇంటర్నెట్ ను ఇవ్వడం కూడా సీఎం కేసీఆర్ లక్ష్యమని దానికి అనుగుణంగా ఫైబర్ గ్రిడ్ పనులు పూర్తి చేయాలన్నారు. అంతకుముందు ఎస్ ఆర్ పీఎస్ జలాల్ పూర్ ఇంటెక్ వెల్ పనుల పురోగతిపై పబ్లిక్ హెల్త్ ఈ.ఎన్.సి ధన్ సింగ్ తో పాటు ఆ శాఖ ఇంజనీర్లతో ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు.

 

Don't Miss