'వంగవీటి' రగడ..

22:24 - December 3, 2016

విజయవాడ : రామ్‌గోపాల్ వర్మ తెరకిక్కిస్తున్న వంగవీటి చిత్ర వివాదం రోజురోజుకు ముదరుతోంది. వంగవీటి ఆడియో ఫంక్షన్‌ కోసమని విజయవాడ వచ్చిన వర్మ వంగవీటి కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ చర్చలు అసంతృప్తిగా ముగిశాయి. వంగవీటి కుటుంబసభ్యులు తనకు నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారని వర్మ ట్వీట్ చేశారు. మరోవైపు వాస్తవాలకు భిన్నంగా సినిమా ఉంటే మాత్రం సహించేది లేదని రాధా హెచ్చరించారు.

వంగవీటి రంగాను అవమానించే సన్నివేశాలుంటే సహించం : వంగవీటి రాధా
దర్శకుడు రాంగోపాల్ వర్మ విజయవాడలో హల్‌చల్ చేశాడు. వంగవీటి ఆడియో ఫంక్షన్‌ కోసమని విజయవాడ వచ్చిన వర్మ వంగవీటి కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. విజయవాడ రౌడీయిజం బ్యాక్‌డ్రాప్‌తో వంగవీటి సినిమా చేస్తున్నానని వర్మ ప్రకటించిన దగ్గర నుంచి ఈ చిత్రం హాట్ టాపిక్ అయింది. వంగవీటి సినిమాలో అభ్యంతకర సన్నివేశాలున్నాయని వంగవీటి రంగా తనయుడు రాధా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రాధా కుటుంబసభ్యులను కలిసి వారికి ఉన్న అభ్యంతరాలపై వర్మ చర్చించారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయి.

మొట్టమొదటిసారి నవ్వుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేవాళ్లను చూశా: వర్మ
ఈ సమావేశంలో జరిగిన పరిణామాలను వర్మ ట్విట్టర్‌లో వివరించారు. తాను జీవితంలో ఇప్పటివరకు చాలా సీరియస్ వార్నింగులు చూశాను గానీ.. మొట్టమొదటిసారి నవ్వుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చేవాళ్లను చూశానని వర్మ చెప్పారు. మీటింగ్ అంత ఆశాజనకంగా సాగలేదని.. సినిమాకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని.. నేను మాత్రం వెనక్కి తగ్గనని.. ఏం జరుగుతుందో చూడాలన్నారు.

రాంగోపాల్ వర్మకు వంగవీటి రాధాకృష్ణ హెచ్చరికలు
వంగవీటి చిత్రంలో వంగవీటి రంగాను అవమానపరిచేలా సన్నివేశాలుంటే సహించేది లేదని... రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు. ఈ సినిమాలో తమ అభ్యంతరాలను ఇంతకుముందే వర్మకు వివరించామని చెప్పారు. వాస్తవాలను వక్రీకరించేలా చిత్రం రూపొందిస్తే.. రంగా అభిమానులు మూవీని అడ్డుకుని తీరుతారన్నారు.

చర్చలు అంత సంతృప్తికరంగా సాగలేదు : కొడాలినాని
ఇరువర్గాల మధ్య జరిగిన చర్చలు అంత సంతృప్తికరంగా సాగలేదని ఈ చర్చల్లో పాల్గొన్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. వర్మ, రాధ ఎవరూ వెనక్కి తగ్గేవారు కాదని.. కానీ అభ్యంతరకర సన్నివేశాల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది వర్మేనని ఆయన అన్నారు. లేదంటే వర్మ ఇబ్బంది పడతారన్నారు.. రాధాతో భేటీ అనంతరం టీడీపీ నేత దేవినేని నెహ్రుతో వర్మ భేటీ అయ్యారు. సినిమాలో తనను ఎలా చూపించినా అభ్యంతరం లేదని నెహ్రు అన్నారు. సామాజిక అంశాలపై సినిమాలు తీసే హక్కు దర్శకులకు ఉందన్నారు.

ఈ వివాదం ఎంత వరకు దారి తీయనుందో?
తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని రాధా, రత్నకుమారి చెబుతుంటే.. వారి అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోనని వర్మ స్పష్టంచేశారు. మొత్తమ్మీద వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో వివాదానికి తెరదీశారు. ఈ వివాదం ఎంత వరకు దారి తీస్తుందో వేచి చూడాలి.. 

Don't Miss