టీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాఫ్ అన్న కాంగ్రెస్...

06:54 - September 3, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. సభ అట్టర్‌ ప్లాప్‌ అయ్యిందని విమర్శించింది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్‌ విఫలమయ్యారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ప్రజల్లోకి వెళ్లనున్నట్టు తెలిపారు. ప్రగతి నివేదన సభ ప్రజల ఆవేదన సభగా మారిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టివిక్రమార్క ధ్వజమెత్తారు..

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలులో కేసీఆర్ విఫలమయ్యారని ఉత్తమ్‌ విమర్శించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ముస్లింలు, గిరిజన రిజర్వేషన్ల పెంపు, దళితులు, గిరిజనులకు మూడెకరాల భూమి పంపిణీలాంటి విషయాలను కేసీఆర్‌ ప్రస్తావించకపోవడాన్ని ఉత్తమ్‌ తప్పు పట్టారు.

ప్రగతి నివేదన సభ కాస్తా ప్రజల ఆవేదన సభగా మారిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్‌ నాలుగేళ్ల పాలనలో చేసిన అప్పులు, సాధించిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగ నియామకాలను సభలో ప్రస్తావించకపోవడంపై ఆయన మండిపడ్డారు.

టీఆర్‌ఎస్‌ నిర్వహించినది ప్రగతి నివేదన సభకాదని... అది ప్రగతి నిరోధక సభ అంటూ మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో వసూళ్లకు అలవాటుపడిన టీఆర్‌ఎస్‌ నాయకులు.. నేడు సభ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కహామీని నెరవేర్చకుండా.. మాటలగారడి చేస్తున్నారని తెలిపారు. మొత్తానికి ప్రగతి నివేదన సభపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు సంధిస్తున్నారు. ఆ సభతో తమ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

Don't Miss