కరుణిస్తే 'అమ్మ'...కక్ష కడితే అపరకాళిగా...

20:40 - December 6, 2016

చెన్నై : తమిళనాడు రాజకీయాల్లో 'అమ్మ'గా ఆదరణ పొందిన జయలలిత-ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనకాడేవారు కాదు. కరుణిస్తే అమ్మ...కక్ష కడితే అపరకాళిగా కఠినంగా ఉండేవారు. ఆమె తీసుకునే నిర్ణయాల వల్ల ప్రజలతో పాటు ప్రత్యర్థులు సైతం షాక్‌ తినేవారు. అమ్మ రాజకీయ జీవితంలో తీసుకున్న అతిముఖ్య నిర్ణయాలేంటో చూద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాజకీయాల్లో ఎన్నో ఆటు పోటు లెదుర్కొన్నారు. 1989లో తమిళనాడు అసెంబ్లీలో దుశ్శాసన పర్వం జరిగింది. జయపై డిఎంకె ఎమ్మెల్యేలు దాడి చేసి చీర లాగారు. చిరిగిన చీరతోనే బయటకు వచ్చిన ఆమె సిఎం అయ్యేవరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేశారు. అన్నట్లుగానే 1991 సిఎం అయ్యారు.

జైలుకు..
1996లో డిఎంకె ప్రభుత్వ హయాంలో అక్రమ ఆస్తుల కేసులో జయ జైలుకి వెళ్లారు. అనంతరం బెయిలుపై విడుదలయ్యారు. నేనెక్కడికి వెళ్లానో...తన ప్రత్యర్థులని కూడా అక్కడికే పంపిస్తానని శపథం చేశారు. 2001లో అధికారంలోకి వచ్చిన జయ ప్రతీకారం తీర్చుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థి కరుణానిధిని అర్ధరాత్రి దాటాకా రెండు గంటలకు కరుణానిధిని జైలుకి పంపారు. అక్రమ ఆస్తుల కేసులో జయలలిత ఇంటి నుంచి ఐటి అధికారులు భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విరక్తి చెందిన జయలలిత బంగారు ఆభరణాలకు దూరంగా ఉన్నారు. 2001లో ఆందోళనకు దిగిన ఉద్యోగులపై ఉక్కుపాదం మోపారు. ఒకేసారి ఆందోళనకు దిగిన 2 లక్షల మంది ఉద్యోగులపై వేటు వేశారు. జయ నిర్ణయం అప్పట్లో సంచలనం సృష్టించింది.

పలు నిర్ణయాలు..పలు సంక్షేమ కార్యక్రమాలు..
2001లో తమిళనాడులో లాటరీ టికెట్లను రద్దు చేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌పై ఆంక్షలు విధించారు. ఆలయాల్లో జంతు బలులపై కూడా నిషేధించారు. అయితే 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందడంతో రైతులు, జంతు బలుల విషయంలో తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. తొలిసారి మహిళా పోలీస్‌ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన ఘనత జయలలితకే దక్కింది. మహిళా పోలీస్‌ స్టేషన్లలో కేవలం మహిళా పోలీసులు, అధికారులనే నియమించారు. అనాథ ఆడపిల్లల ఆలనా పాలనా చూసేందుకని 1992లో క్రెడిల్‌ బెబీ స్కీంను ప్రారంభించారు. 2013లో పేదల కడపు నింపేందుకు అతి చవకగా అమ్మ క్యాంటీన్‌ను జయలలిత ప్రారంభించారు. రూపాయికే ఇడ్లీ, మూడు రూపాలకు చపాతీ, ఐదు రూపాయలు ప్లేట్‌ భోజనం ఏర్పాటు చేశారు. మద్యపాన నిషేధంపై ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు 2016లో 5 వందల మద్యం షాపులను మూసివేస్తూ జయలలిత నిర్ణయం తీసుకున్నారు.

Don't Miss