ఢిల్లీలో అమెరికా యువతిపై గ్యాంగ్ రేప్..

17:06 - December 3, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అమెరికాకు చెందిన ఓ యువతిపై జరిగిన గ్యాంగ్‌ రేప్‌ ఆలస్యంగా వెలుగు చూసింది. కనాట్‌ ప్లేస్‌ సమీపంలో ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో తనపై ఐదుగురు దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డట్లు ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో టూరిస్ట్‌ గైడ్‌ కూడా ఉన్నట్లు పేర్కొంది. గత మార్చిలో జరిగిన ఈ దారుణం గురించి బాధితురాలు ఈమెయిల్‌ ద్వారా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి వాంగ్మూలం ఇస్తానని ఆ యువతి తెలిపింది. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలని ఢిల్లీ పోలీసులకు అమెరికా రాయబార కార్యాలయం ఈమెయిల్‌ ద్వారా తెలిపింది. టూరిస్ట్‌ వీసాపై వచ్చిన అమెరికన్ యువతి కనాట్‌ ప్లేస్‌ దగ్గరలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్లో బసచేసింది. ఆమె హోటల్‌ రూమ్‌లో ఉన్న సమయంలో రూట్‌ ప్లాన్‌ గురించి మాట్లాడాలంటూ గైడ్‌ మరో నలుగురితో కలసి వచ్చాడు. ఆమెకు బలవంతంగా డ్రింక్ తాగించి అఘాయిత్యానికి పాల్పడ్డట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ దారుణం జరిగిన తర్వాత బాధితురాలు వెంటనే భారత్‌ నుంచి అమెరికా వెళ్లిపోయింది. 

Don't Miss