'జయ' తనకు సోదరి - సి.కళ్యాణ్...

08:26 - August 31, 2018

హైదరాబాద్ : ప్రముఖ దర్శకురాలు జయ మృతి చెందడం పట్ల నిర్మాత సి.కళ్యాణ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. జయ పార్థీవ దేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన టెన్ టివితో మాట్లాడారు. జయ తమ కుటుంబసభ్యురాలని, , జయ కుటుంబంతో తనకు అనుబంధం ఉందన్నారు. జయ మృతి చెందడంతో భర్త రాజు కృంగిపోయాడని, తామంతా అతనికి సపోర్టుగా ఉంటామన్నారు. జయ మృతి తీరని లోటు అని విషాద వదనంతో వెలుబుచ్చారు.

సినీ దర్శకురాలు బి. జయ గుండెపోటుతో గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం ఆమె వయస్సు 54 ఏళ్లు. గుండమ్మగారి మనువడు, లవ్‌లీ, చంటిగాడు, వైశాఖంసహా మొత్తం ఏడు చిత్రాలకు ఆమె దర్శకత్వం వహించారు. తెలుగు సినిమా రంగంలో జర్నలిస్టుగా పనిచేసిన జయ.. 2003లో చంటిగాడు చిత్రంతో దర్శకురాలిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. చెన్నై విశ్వవిద్యాలయంలో ఎంఏ, జర్నలిజంలో డిప్లొమా కోర్సును పూర్తి చేశారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో శుక్రవారం ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి.

Don't Miss