వీళ్లు.. అటా ? ఇటా?

09:25 - September 8, 2018

తూర్పు గోదావరి : ఓట్లేశారు.. కానీ వారి పాట్లు పట్టించుకునే వారే కనిపించడం లేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలొస్తున్నాయి. ఎవరికి ఓటేయాలో కూడా తెలియని సందిగ్ధంలో పడ్డారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణా నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలిపేయడంతో ఇప్పుడు 6మండలాల ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని విలీన మండలాల పరిస్థితి ఆయోమయంగా ఉంది.
తెలంగాణలోని ఆరు మండలాలు ఏపీలో విలీనం
ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణాకి చెందిన భద్రాచలం డివిజన్ లోని ఆరు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపేశారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలను పశ్చిమ గోదావరిలో విలీనం చేయగా, చింతూరు, ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాలను తూర్పు గోదావరిలో కలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకి రాకుండా కేంద్రం ఆర్డినెన్స్ రూపంలో తీసుకున్న ఈ నిర్ణయానికి తాను పట్టుబట్టడమే కారణమని చంద్రబాబు అప్పట్లో పదే పదే చెప్పుకున్నారు.
గందరగోళంగా ఆ నియోజకవర్గాల పరిస్థితి 
ఐతే.. నాలుగేళ్లు గడిచిపోయినా ఆ నియోజకవర్గాల పరిస్థితి మాత్రం ఇంకా గందరగోళంగానే ఉంది. భద్రాచలం నియోజకవర్గంలో ఓట్లేసిన వారిని ఏపీలో కలిపేయడంతో అటు తెలంగాణా నుంచి నిధులు రాక, ఇటు ఏపీ సర్కారు పట్టించుకోక రెంటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారు. చివరకు విద్య, వైద్య అవసరాలు తీర్చడానికి కూడా తగిన నిధులు లేకపోవడంతో మన్యం వాసులు నరకం అనుభవించారు. వచ్చే ఎన్నికల తర్వాతైనా తమకు కొంత ఉపశమనం దక్కుతుందని ఆశించిన విలీన మండలాల ప్రజలకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మరింత షాక్‌నిస్తున్నాయి. తాజాగా తెలంగాణా అసెంబ్లీ రద్దయ్యింది. ఎన్నికలకు సిద్దమవుతోంది. దీంతో భద్రాచలం నియోజకవర్గ ఓటర్ల జాబితాలో చింతూరు డివిజన్ జాబితాను చేర్చడం కలకలం రేపుతోంది. తమను మళ్లీ తెలంగాణాలో ఓటేయాలని చెప్పడం ఏవిధంగా సమంజసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చివరకు రద్దయిన అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన సున్నం రాజయ్య కూడా ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. విలీన మండలాల ప్రజల ఓట్లను ఆంధ్రప్రదేశ్ జాబితాలో చేర్చడంలో చేసిన జాప్యం కారణంగానే ప్రస్తుత పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నాయి. 
విలీన మండలాల వ్యవహారంపై అస్పష్టత
విలీన మండలాల వ్యవహారంలో స్పష్టత లేకపోవడం చాలామందిని గందరగోళానికి గురి చేస్తోంది. కేంద్రం తక్షణం జోక్యం చేసుకుని రెవెన్యూ పరంగా ఏపీలో ఉన్న మండలాల ఓట్లను ఏపీలోనే కలపాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి భిన్నంగా ఓట్లను తెలంగాణా అసెంబ్లీకి వేసి, పాలన ఏపీలో అంటే ఎటూ కానివాళ్లుగా ముంపు మండలాల ప్రజలు మిగిలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. ఈ విషయంలో ఏ ప్రభుత్వం తీసుకుంటుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. 

 

Don't Miss