కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం

21:51 - September 11, 2018

జగిత్యాల : కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి...లోయలోకి దూసుకెళ్లడంతో 57 మృతి చెందారు. గాయపడ్డ క్షతగాత్రులకు ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించారు.
తప్పి లోయలో పడిన బస్సు 
కొండగట్టు ఘాట్ రోడ్డు నుంచి కిందికి దిగుతున్న బస్సు....చివరి మలుపు వద్ద అదుపు తప్పి లోయలో పడింది. దీంతో పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి కొందరి తీవ్ర గాయాలు కావడంతో...ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు కరీంనగర్, హైదరాబాద్ కు తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న మృతులు బంధువులు, కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటన స్థలంలో తమ బంధువులను చూసి....కన్నీరుమున్నీరయ్యారు.
ఊపిరాడక పలువురు అక్కడికక్కడే మృతి 
బస్సు లోయలో పడటంతో ఊపిరాడక పలువురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది పెద్దపల్లి, జగిత్యాల జిల్లా వాసులు ఉన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక యువకులు సహాయ చర్యల్లో పాల్గొని...ఆసుపత్రులకు తరలించారు. జగిత్యాల ఆస్పత్రి మొత్తం మృతుల బంధువులతోనే నిండిపోయింది. తమ వారి మృతదేహాలను...కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 
ప్రమాదంపై కేసీఆర్, గవర్నర్ దిగ్భ్రాంతి 
కొండగట్టు రోడ్డు ప్రమాదంపై అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ నరసింహాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేసిన కేసీఆర్...క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతులకు కుటుంబాలకు 5లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. తాజా మాజీ మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, మహేందర్ రెడ్డిలు...క్షతగాత్రులను పరామర్శించి...వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆర్టీసీ తరపున 3లక్షల రూపాయలు సాయం అందిస్తామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ , మహేశ్వర్ రెడ్డిలు పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. పోస్టు మార్టం పూర్తి కావడంతో మృతదేహాలను బంధువులకు అప్పగించేందుకు ట్రాక్టర్ లో తరలించారు.

 

Don't Miss