తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్ధం

07:23 - September 7, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ వీడిపోయింది. ముందస్తు ఎన్నికలపై ఇంతకాలం ఊరించిన సీఎం కేసీఆర్.. తన నిర్ణయాన్ని ప్రకటించేశారు. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేశారు. ఉదయం నుంచి చకచకా జరిగిన పరిణామాలు.. తెలంగాణలో ఎన్నికలకు రంగం సిద్ధం చేశాయి. ఎన్నికల ఫీవర్‌ను తెచ్చేశాయి. 
అసెంబ్లీ రద్దు 
సీఎం కేసీఆర్‌ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారు. నిన్న మధ్యాహ్నం కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్‌, అసెంబ్లీ రద్దునే ఏకైక అజెండాగా పెట్టారు. మంత్రి మండలి క్షణాల్లో ఏకగ్రీవంగా అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ఆమోదించింది. కేవలం నాలుగు నిమిషాల్లోనే కేబినెట్‌ సమావేశం ముగియడం విశేషం. ఆ వెంటనే, మంత్రులందర్నీ తీసుకుని సీఎం కేసీఆర్‌ ప్రత్యేక బస్సులో రాజ్‌భవన్‌కు వెళ్లారు. 
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్‌
గవర్నర్‌ నర్సింహన్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు సీఎం కేసీఆర్‌. అసెంబ్లీని రద్దు చేస్తూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని గవర్నర్‌కు కేసీఆర్ అందజేశారు. అసెంబ్లీ రద్దుకు కారణాలను ఆయనకు వివరించారు. తదుపరి కార్యాచరణపై చర్చించారు. దీనికి వెంటనే నర్సింహన్‌ ఆమోద ముద్ర వేశారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకూ సీఎం కేసీఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ సూచించారు.
గవర్నర్‌ ఆమోద ముద్రతో అసెంబ్లీ రద్దు
గవర్నర్‌ ఆమోద ముద్ర పడడంతో, తెలంగాణ అసెంబ్లీ రద్దైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి నోటిఫికేషన్‌ జారీ చేశారు. అసెంబ్లీ రద్దు విషయాన్ని అధికారులు ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు. నవంబర్‌లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాంకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, వాటితో పాటే తెలంగాణకూ ఎన్నికలను ఈసీ నిర్వహించే అవకాశం ఉంది. అక్టోబర్‌ మొదటి వారంలో ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని కేసీఆర్ ధీమాగా ఉన్నారు. నవంబర్‌లో ఎన్నికలు జరిగి, డిసెంబర్‌లో ఫలితాలు వెలువడే అవకాశాలున్నాయంటున్నారు. కేసీఆర్ నిర్ణయంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ముందస్తు రావచ్చంటూ కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిశితంగా గమనిస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ టీడీపీలు ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయాయి. 

 

Don't Miss