టీఆర్ ఎస్ లో టిక్కెట్ల లొల్లి...

07:42 - September 9, 2018

కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో లుకలుకలు మొదలయ్యాయి. అసెంబ్లీ రద్దై...ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. టికెట్ వస్తుందని ఆశించిన నేతలకు టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశనిస్పృహలో ఉన్నారు. కేసీఆర్‌.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే ఎమ్మెల్యే టిక్కెట్లను ప్రకటించడంతో ఆశావహులంతా కారు దిగేందుకు సిద్ధమయ్యారు. ఇంతకాలం పార్టీని నమ్ముకున్న నేతలంతా ఇప్పుడు అధినేత కేసీఆర్ నిరసన గళం వినిపిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 స్థానాల్లో 12 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించడంతో మంథని, రామగుండంలో నిరసనలు మొదలయ్యాయి. 

టీఆర్‌ఎస్‌లో ఇంతకాలం టికెట్‌ కోసం ఎదురు చూసిన నేతలంతా ఇప్పుడు కండువా మార్చేందుకు రెడీ అవుతున్నారు. 
సిట్టింగ్‌లకు టికెట్‌ ఇచ్చి కేసీఆర్‌ తమను మోసం చేశారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణపై సొంత పార్టీ నేతలే ఇప్పటికే తిరుగుబాటు ప్రకటించారు. ఎమ్మెల్యే హఠావో.. పార్టీ బచావో అంటూ వ్యతిరేకవర్గం ఏకమైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై  కోరుకంటి చందర్‌  ఫైర్‌ అవుతున్నారు. పార్టీ టికెట్ కోసం ఆయన శతవిధాలా ప్రయత్నాలు చేశారు. చందర్‌కు పార్టీ టికెట్‌ రాకపోవడంతో ఆయన అభిమాని ఒకరు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి హంగామా సృష్టించారు. చందర్‌ కూడా పార్టీ తనకు అన్యాయం చేసిందంటూ కన్నీరుపెట్టుకున్నారు.

రామగుండం జెడ్పీటీసీ సంధ్య దంపతులు కూడా ఎమ్మెల్యే టికెట్‌ను ఆశించారు. రెండేళ్లుగా క్షేత్రస్థాయిలో పనులు కూడా చేస్తున్నారు. చివరికి అధినేత సోమారపుకే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడం, సంధ్యారాణి దంపతులకు టికెట్‌ ఇవ్వకపోవడంతో సాగర్‌ , సంతోష్‌ అనే యవకులు కిరోసిన్‌ పోసుకుని  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

ఇక మంథనిలోనూ సేమ్‌ టూ సేమ్‌ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే రామ్‌రెడ్డి కుమారుడు టీఆర్‌ఎస్‌ యువజన రాష్ట్ర కార్యదర్శి సునీల్‌రెడ్డి మరోసారి ఆశాభంగం ఎదురైంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోటలో పుట్ట మధుకు టికెట్‌ ఇవ్వడంతో సునీల్‌రెడ్డి మద్దతుదారులు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. రామ్‌రెడ్డిని కాదని పుట్టా మధుకు టికెట్‌ ఇవ్వడంపై ఇరువురి నేతల మధ్య విభేదాలు పెంచాయి.  ఇలా ప్రతి చోటా నేతల మధ్య టికెట్లు కుంపట్లు కొనసాగుతున్నాయి. మంథని, రామగుండం నియోజకవర్గాల్లో టికెట్‌ రాని ఆశావహులంతా కాంగ్రెస్‌, జనసమితిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

Don't Miss