హత్య ఖరీదు రూ.10 లక్షలు

12:18 - September 9, 2018

గుంటూరు : జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ముఠా ఓ వ్యక్తిని హత్య మార్చింది. చిలకలూరిపేట మండలం యడవల్లి సమీపంలో ఈనెల 3వ ఘటన చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామానికి చెందిన నూతలపాటి అంజనీరాజు అలియాస్‌ ఆంజనేయరాజు, నూతలపాటి రామాంజనేయులు, అంజయ్య, కోటేశ్వరరావులు అన్నదమ్ముల పిల్లలు. వీరి కుటుంబంలోని ఒక మహిళతో అంజనీరాజు వివాహేతర సంబంధం సాగిస్తున్నాడని అనుమానంతో రామాంజనేయులు, అంజయ్య, కోటేశ్వరరావు అతనిపై కక్ష పెంచుకొని చంపాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం పొలం అమ్మి డబ్బులు కూడా సమీకరించారు. ఇది తెలిసిన అంజనీరాజు ఈ ఏడాది మే నెలలో చిలకలూరిపేటకు వెళ్లాడు. ఊరు వదలిపెట్టినా అంజనీరాజును చంపుతామని వారంతా బంధువులతో చెప్పారు. అంజనీరాజును చంపేందుకు సాధు బాబు, సాధు రమేష్‌లను అనే వ్యక్తులను వారు సంప్రదించారు. ఎలాగైనా అంజనీరాజును చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని కోరారు. అందుకు సాధు రమేష్‌ రూ.10 లక్షలు డిమాండ్‌ చేశాడు. దాని ప్రకారం పథకం రూపొందించిన కిరాయి ముఠా.. ఈనెల 3వ తేదీ రాత్రి అంజనీరాజు పనిచేసే యడవల్లి గ్రానైట్‌ క్వారీ వద్దకు వెళ్లారు. సాధు రమేష్‌ అతని మిత్రులు ఏసుబాబు, అచ్చిబాబులు ఇనుప పైపులతో అంజనీరాజు తలపై కొట్టి చంపారు. ఉదయం పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసిన చిలకలూరిపేట గ్రామీణ సీఐ శోభన్‌బాబు చురుగ్గా దర్యాప్తు నిర్వహించి 4 రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

 

Don't Miss