తెలుగు రాష్ట్రాలు..రివైండ్ 2017..

20:21 - December 28, 2017

ఆకాశాన్నంటుతున్న ధరలు.. భారమైపోయిన సామాన్యుడి బతుకు... హక్కుల కోసం ఉద్యమాలు.. అస్థిత్వం కాపాడుకునే ఆరాటం.. ప్రజల బాగోగులు చివరి ప్రాధాన్యతగా పెట్టుకున్న ప్రభుత్వాలు.. పైపై మెరుగులు తప్ప సామాన్యుడి బతుకును నిర్లక్ష్యం చేసే విధానాలు..దళితులపై పెరుగుతున్న దాడులు.. పరువు కోసం హత్యలు...విదేశీ సదస్సుల ఆడంబరాలు... పరిమళించిన తెలుగు ఉత్సవాలు.. పరుగులెత్తుతున్న మెట్రో రైలు, రికార్డుల బాహుబలి2 ఇవీ 2017లో తెలుగు ప్రజలు చూసిన అనుభవాలు.. ఇలాంటి ఘటనల సమాహారంగా రెండు రాష్ట్రాల్లో జరిగిన ముఖ్యాంశాలపై ప్రత్యేక కథనం..

హోరెత్తే ప్రచారం.. ఘాటైన విమర్శలు..పదునైన కామెంట్లు..దుమ్మురేపిన రోడ్ షోలు.. మీటింగ్ లు..వెరసి గెలుపుకోసం అంతులేని ఆరాటం.. సెమీఫైనల్ గా భావించిన నంద్యాల ఉపఎన్నిక ఏపీలో హడావుడి చేసింది. ఎప్పుడెప్పుడా అని నగరవాసి ఎదురు చూసిన మెట్రో రైలు నగరంలో పరుగులు తీస్తోంది. ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా, కాలుష్యానికి దూరంగా, సౌకర్యవంతమైన ప్రయాణంతో, మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. మెట్రో టికెట్టు ధరలపై మాత్రం విమర్శలు ఎక్కువవుతున్నాయి..పాదయాత్రలు అధికారాన్ని తెచ్చిపెట్టాయి. ప్రజలకు దగ్గరచేశాయి.. పాదయాత్ర పునాదిగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అది చరిత్ర. ఇప్పుడు ఏపీలో మహాసంకల్ప యాత్ర నడుస్తోంది.. దీంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రజాసంకల్ప యాత్రతో తన సంకల్ప సాధన కోసం జగన్ ప్రయత్నాలు 45 రోజులుగా సాగు

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న మహాసభలకు ప్రపంచ నలుమూలలా నుంచి అనేకమంది భాషాభిమానులు, సాహితీవేత్తలు హాజరయ్యారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై... జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాలనుంచి 400 మంది భాషాభిమానులు.. మొత్తం ఉత్సవాలకు 8 వేల మంది ప్రతినిధులు హాజరయ్యారయ్యారు. పవిత్ర సంగమం కాస్తా విషాద సంగమమయింది. గతేడాది గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలిగొన్న ఘటన ఇంకా కళ్లముందు నుంచి చెరిగిపోలేదు. దానిపై విచారణ ఇప్పటికీ అతీగతీ లేదు. ఈ లోగా కృష్ణా నదిలో ఈ ప్రమాదం జరిగింది.. ఇక కార్తీక మాసంలో పవిత్ర సంగమం వద్ద జనం పోటెత్తుతారని తెలిసినా యంత్రాంగం అప్రమత్తం కాని తీరు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో బినమా పేర్లతో అక్రమ అనుమతులతో బోట్లు నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నేతల తీరు కూడా తెరపైకి వచ్చింది.

నగరవాసులంతా ఇవాంకా రావా మా వంక అని పిలిచారు. ఇవాంక వస్తే చాలు.. తమ ప్రాంత చిత్రంలో కాస్తయినా మార్పు వస్తుందని భావించారు. ఇన్నేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నం.. అప్పుడెప్పుడో బిల్ క్లింటన్ వస్తున్నాడని చంద్రబాబు హడావుడి చేసిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు కెసీఆర్ హయాంలో ఈ హడావుడి కనిపిస్తున్నదని చెవులు కొరుక్కుంటున్నారు నగర వాసులు.. జీఈఎస్ ఘనంగా నిర్వహించారని తెలంగాణ సర్కారు క్రెడిట్ పొందినా, నగరంలో మౌలిక సదుపాయాల విషయంలో మామూలు సమయంలో చూపే నిర్లక్ష్యం కూడా తెరపైకి వచ్చింది.

ఇండియన్ సెల్యులాయిడ్ పై ఆవిష్కృతమైన భారీ చిత్రం.. కనీవినీ ఎరుగనంత భారీ బడ్జెట్.. ఎన్నో అంచనాల మధ్య.. మరెంతో ఉత్కంఠను రేకెత్తించి, లక్షలాది ప్రేక్షకులను అలరించింది. మగధీర, ఈగ బాటలోనే బాహుబలి వన్ బాటలోనే బాహుబలి2 కూడా సత్తా చాటింది. 2017 ఏప్రిల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. పోలవరం ప్రాజెక్టు అంచనాలు దాటుతోంది. టార్గెట్ సమయం దాటుతోంది..నిధుల కొరత వేధిస్తోంది..పనులు ఆగిన పరిస్థితి కనిపిస్తోంది.. మొత్తానికి 2017లో పోలవరం పరిస్థితి అంతంత మాత్రంగానే సాగిందని చెప్పాలి.. తెలుగు రాష్ట్రాల్లో దళితులపై, బహుజనులపై దాడులు మరింత పెరిగాయి.. కులం దన్ను, రాజకీయ బలం, ఆర్ధిక బలాన్ని చూసుకుని కొందరు పేట్రేగి పోతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. అదే సమయంలో పరువు హత్యలు కూడా పెరుగుతున్నాయి. 2017లో నరేశ్, మధుకర్ ల హత్యలతో పాటు, గరగపర్రు ఘటన సంచలనం కలిగించాయి..

చంద్రన్న మాల్స్‌ ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు, గృహోపకరణాలు, సౌందర్య సాధనాలు తక్కువ ధరలకు వస్తాయా? అలా వస్తాయంటూ చెప్తున్న సీఎం మాటల్లో నిజమెంత? చంద్రన్న మాల్స్‌తో ప్రజలకు జరిగే మేలు కన్నా, కార్పొరేట్లకు చేకూరే లబ్ధి ఎక్కువా? రిలయన్స్ లాంటి సంస్థలు ఒక్క రూపాయి పెట్టుబడి కూడా పెట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో దందాకు దిగుతున్నాయా? దానికి ఏపీ సర్కారు వత్తాసు పలుకుతోందా? ప్రజాపంపిణీ వ్యవస్థకు తూట్లు పొడిచే పనికి 2017లో ఏపీ సర్కారు దిగింది.
ఇవీ 2017లో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ముఖ్య ఘటనల వివరాలు. గుర్తు చేసుకోవలసిన అంశాలు.. అనంత కాల గమనంలో మరో వసంతం గడిచిపోతోంది. 2018 రెండు రాష్ట్రాల్లో శాంతి, సామరస్యాలు నెలకొని, ప్రజలకు మంచి జరగాలని ఆశిద్దాం. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss