జయ'కు తెలుగు నటుల నివాళి..

19:22 - December 6, 2016

తమిళుల అమ్మ...పురుచ్చితలైవి.... తమిళనాడు సీఎం జయలలిత మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. తెలుగు సినీ నటులంతా జయలలిత మృతిపై తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. తమిళంతో పాటు, తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్న గొప్ప నటి జయలలిత అని కీర్తించారు. తమిళుల ఆరాధ్య నాయకి...కథానాయిక నుంచి ప్రజా నాయికగా దేశ రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన జయలలిత మృతిపై...అటు ప్రజలతో పాటు..ఇటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాక తెలుగులోనూ అగ్రకథానాయికగా అభిమానుల గుండెల్లో నిలచిపోయిన జయలలిత మృతిపై పలువురు తెలుగు చిత్ర ప్రముఖులు సంతాపం తెలిపారు.

  • ప్రజల హృదయాల్లో స్థానం దక్కించుకున్న గొప్ప నాయకురాలు జయలలిత అని అలనాటి సినీ నటి జమున అన్నారు. జయలలిత మరణంపై ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయంగాను ఉన్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి అని సీని ప్రముఖులు కొనియాడారు.
  • పేద ప్రజల కోసం సరికొత్త పథకాలు అమలు చేసి...వారి గుండెల్లో అమ్మగా నిలిచిపోయిన వ్యక్తి జయలలితని ప్రముఖ సినీనటులు కృష్ణ అన్నారు. ఆమెతో పాటు కలిసి నటించిన అనుభవాలను కృష్ణ గుర్తుచేసుకున్నారు.
  • కథానాయకులే కాదు..కథా నాయికలు కూడా ప్రజా నాయకులుగా ఎదగగలరని జయలలిత నిరూపించారని సినీ నటులు రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. దేశ రాజకీయ చరిత్రలోనే ధీర వనితగా నిలిచిన..ఆమె మృతి తీరని లోటని దర్శకరత్న దాసరి చెప్పారు.
  • జయలలిత మృతి పట్ల జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలకు పైగా తమిళనాడు, దేశ రాజకీయాలపై ఆమె చెరగని ముద్ర వేశారన్నారు. తమిళ ప్రజలు అమ్మగా కొలుచుకునే జయలలిత బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ఆశగా, శ్వాసగా జీవించారని కొనియాడారు.

Don't Miss