డిజిటల్ తెలంగాణ..

09:41 - December 7, 2016

హైదరాబాద్ : రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. డిజిటల్‌ రూపంలో ఆర్థికలావాదేవీలన్నీ జరిగేలా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం డిజిటల్‌ మనీ ట్రాన్సఫర్‌ పద్ధతిని అవలంబించడం అనివార్యమని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

నగదు రహిత లావాదేవీలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సన్నాహాలు
కేంద్ర ప్రభుత్వం పిలుపునకు అనుగుణంగా.. తెలంగాణ రాష్ట్రంలో నగదు లావాదేవీలన్నీ అతి సులభంగా జరిగేలా సీఎం కేసీఆర్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రగతి భవన్‌లో ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నతాధికారులు సిద్ధార్థ మిశ్రా, వినీత్‌ బల్హోత్రా, అవిజిత్‌ షా, జితా మిత్రాతో... ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్‌ ఆర్థిక లావాదేవీల ట్రెండ్‌ను సీఎంకు... బ్యాంకర్లు వివరించారు. అలాగే డిజిటల్‌ బ్యాంక్‌ సేవలను అందించేందుకు ఐసీఐసీఐ ముందుకొచ్చింది.

డిజిటల్‌ ఫైనాన్షియల్‌ లిటరేచర్‌ పట్ల అవగాహన కల్పించాలన్న సీఎం
మార్పుకు ప్రజలు ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారని అయితే...డిజిటల్‌ ఫైనాన్సియల్‌ లిటరేచర్‌ పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. దీనికోసం ప్రసార మాధ్యమాల్లో ప్రచారం చేయాలని మంత్రి కేటీఆర్‌ను సీఎం ఆదేశించారు. అలాగే ఆర్థిక లావాదేవీల విషయంలో సాంకేతికపరమైన అంశాలను గ్రామీణ యువతకు, రైతులకు..వృత్తిపనులు చేసుకునేవారికి నిపుణులతో శిక్షణ ఇవ్వాలని సూచించారు. త్వరలో..పూర్తిస్థాయిలో నగదు రహిత ఆర్థిక లావాదేవీలు జరిగే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని సీఎం అన్నారు.

రాష్ట్రంలో డెబిట్‌ కార్డుల వాడకం సమాచారాన్ని సేకరించాలని ఆదేశం

నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో .. బ్యాంకర్లు సమన్వయం.. వారి సహాయం ఏ విధంగా ఉంటుందనే అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం వాడకంలో ఉన్న డెబిట్‌ కార్డులు.. వాటి వాడకం ఏ విధంగా ఉన్నదనే సమాచారాన్ని బ్యాంక్‌ల నుంచి సేకరించాలని సీఎంవో అధికారులను సీఎం ఆదేశించారు. కాగా తెలంగాణ ప్రభుత్వం స్వయంగా తయారు చేసి మొబైల్‌ యాప్ టీఎస్‌ వాలెట్‌ను త్వరలో జరగబోయే కలెక్టర్ల సమావేశంలో విడుదల చేయాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు.డిజిటల్‌ మనీ ట్రాన్సాక్షన్‌ పద్ధతిని ఒక్కసారిగా అమలు చేయకూడదని.. దీనికి ప్రజలు కొంత అలవాటుపడాలని సీఎం అభిప్రాయపడ్డారు. మొదటగా ప్రభుత్వంలో నడిచే ఆర్థిక లావాదేవీలను డిజిటల్‌ మనీ ట్రాన్సాక్షన్‌ పద్ధతిలో నడిపించాలని సూచించారు. 

Don't Miss