టీ.ఎస్ 'నో క్యాష్' కసరత్తులు..

10:21 - December 8, 2016

హైదరాబాద్ : పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్‌ తమపై పడకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించింది. క్షేత్రస్థాయిలో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఆర్ధికశాఖ మంత్రి ఈటల రంగంలోకి దిగారు. వీలైనంత తొందరగా గ్రామీణ ప్రాంత ప్రజలను నగదు రహిత లావాదేవీలవైపు ప్రోత్సహించేందుకు చర్యలు ప్రారంభించారు.

ప్రజల ఇబ్బందులకు తొలగించేందుక ప్రభుత్వం చర్యలు
పెద్దనోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించింది. ఇందుకోసం అన్ని ప్రధాన బ్యాంకుల అధికారులు, సీఎస్‌ ప్రదీప్‌చంద్ర, ఫైనాన్స్‌ సెక్రెటరీ సందీప్‌కుమార్‌తో ఆర్ధికమంత్రి ఈటల రాజేందర్‌ సమావేశం నిర్వహించారు. నోట్ల రద్దు ప్రభావం సామాన్య ప్రజలమీద పడకుండా ఉండేందుకు ప్రతిపూట మానిటరింగ్‌ చేయాలని ఆర్ధికశాఖను ఆదేశించారు. ప్రజలందరినీ నగదు రహిత లావాదేవీలవైపు ప్రోత్సహించాలని సూచించారు. పట్టణ ప్రాంతం ప్రజలకు ఎలక్ట్రానిక్‌ ట్రాన్సాక్షన్స్‌పై అవగాహన ఉంటుందని.. గ్రామీణ ప్రాంత ప్రజలకే వీటిపై పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనే కరెన్సీ కష్టాలు అధికం : ఈటల
గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా నగదు కోసం ప్రజలు ఎక్కువ ఇబ్బందిపడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని ఈటల అన్నారు. ప్రతి రైతు 24వేల రూపాయలు డ్రా చేసుకోవడానికి అనుమతి ఉన్నా.. ఎక్కడ కూడా వారికి ఆ డబ్బు ఇవ్వడం లేదన్నారు. రైతులకు నగదు అందేలా చూడాలని బ్యాంకర్స్‌ను కోరారు. ప్రజల ఇబ్బందులు తొలగాలంటే ఎక్కువ డబ్బులు అందుబాటులోకి తీసుకురావాలని, ప్రధానంగా 500,100 నోట్లను ఎక్కువగా చెలామణిలోకి తీసుకురావాలన్నారు. అప్పుడే పేదల కష్టాలు తొలుగుతాయని చెప్పారు. తెలంగాణను నగదు రహిత రాష్ట్రంగా మార్చేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారని... బ్యాంకర్స్‌ కూడా ఇందుకు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. ఎక్కువ సంఖ్యలో స్వైపింగ్‌ మిషన్లు, ఏటీఎంలను పెంచాలన్నారు.

95శాతం కుటుంబాలకు బ్యాంక్‌ అకౌంట్స్‌
నగదు రహిత లావాదేవీలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉందని ఈటల అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 95శాతం కుటుంబాలకు అకౌంట్స్‌ ఉన్నాయన్నారు. 70 లక్షల మంది రూపే కార్డులను తీసుకోగా... అందులో ఇంకా 46 లక్షల కార్డులు ఆక్టివేటే కాలేదన్నారు. వందశాతం క్యాస్‌లెస్‌ ట్రాన్సాక్షన్స్‌ తీసుకురావాలంటే ఇంకా చాలా కష్టపడాలని మంత్రి అన్నారు.

Don't Miss