'అమ్మ' కోసం ఆర్తనాదం..

19:29 - December 6, 2016

చెన్నై : తమిళుల అమ్మ జయలలిత అంతిమయాత్ర అశ్రునయనాల మధ్య ముగిసింది. చెన్నైలోని రాజాజీ పబ్లిక్‌ హాలు నుంచి మెరీనా బీచ్‌ వరకు సాగింది. జయ అంతిమయాత్రలో పలువురు ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, మాజీ గవర్నర్‌ రోశయ్య, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌, అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంజీఆర్‌ సమాధి పక్కనే జయలలిత భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. జయలలిత భౌతిక కాయానికి ఆమె నిశ్చెలి శశికళ అంతిమ సంస్కారం నిర్వహించారు. తమిళుల అమ్మ, ఎందరో అభిమానుల పాలిట ఆరాధ్య దైవం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ చెన్నైలోని రాజాజీ పబ్లిక్‌ హాలులో జయలలిత మృతదేహానికి నివాళులు అర్పించారు. జయ స్నేహితురాలు శశికలను, తమిళనాడు సీఎం పన్నీర్‌సెల్వంను ఓదార్చారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోరాట యోధురాలని, అన్ని పోరాటాల్లో ఆమె గెలిచారని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ వ్యాఖ్యానించారు. దేశం ఒక మంచి నేతను కోల్పోయిందని అన్నారు.

రాష్ట్రపతి, మోడీ శ్రద్ధాంజలి..
సంక్షేమ కార్యక్రమాలతో జయలలిత పేదలకు దగ్గరయ్యారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. జయలలిత మృతదేహానికి ప్రధాని మోదీ శ్రద్దాంజలి ఘటించారు. మోదీతోపాటు గవర్నర్ విద్యాసాగర్ రావు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతోపాటు పలువురు నేతలు ఉన్నారు. అనంతరం ఆయన అన్నాడీఎంకే నేతలను కూడా కలిసి ఓదార్చారు. మోదీని చూసి అన్నాడీఎంకే నేతలు కన్నీరుమున్నీరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జయలలిత భౌతిక ఖాయానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.

పలువురు సంతాపం..
జయలలిత మృతి పట్ల సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాపం ప్రకటించింది. జయ మృతితో విషాదంలో మునిగిన తమిళ ప్రజలు త్వరగా తేరుకోవాలని ఆయన సంతాప ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జయలలిత మృతిపట్ల నివాళులు అర్పించారు. దేశరాజకీయాల్లో జయలలిత లేని లోటు తీర్చలేనిదని రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ దివంగత ముఖ్యమంత్రి జయలలితకు నివాళులు అర్పించారు. జయలలిత పార్థివదేహం ఉంచిన చెన్నైలోని రాజాజీ పబ్లిక్‌ హాల్‌కు రజనీ తన కుటుంబ సభ్యులతో కలసి వచ్చారు. రజనీ వెంట భార్య లత, అల్లుడు ధనుష్‌, కుమార్తెలు ఉన్నారు. జయలలిత భౌతికకాయానికి నివాళులు అర్పించిన రజనీ.. ఆమె స్నేహితురాలు శశికళను పరామర్శించారు. రజనీ కటుంబ సభ్యులు కూడా శశికళను ఓదార్చారు. జయలలిత పార్థివదేహం పక్కన ఉన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడితో రజనీకాంత్‌ కాసేపు మాట్లాడారు. జయలలితను చివరిసారి చూసి నివాళులు అర్పించేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.

అంతిమయాత్ర..
అనంతరం రాజాజీ పబ్లిక్‌ హాల్‌ నుంచి మెరీనా బీచ్‌ వరకు జయలలిత అంతిమయాత్ర సాగింది. లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులు.. శోక తప్త హృదయాలతో జయలలితకు అంతిమ వీడ్కోలు పలికారు. తమిళుల అమ్మ జయలలిత అంతిమయాత్ర చెన్నైలోని రాజాజీ పబ్లిక్‌ హాలు నుంచి మెరీనా బీచ్‌ వరకు సాగింది. జయ అంతిమయాత్రలో పలువురు ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, మాజీ గవర్నర్‌ రోశయ్య, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌, పలువురు సినీ ప్రముఖులు, అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంజీఆర్‌ సమాధి పక్కనే జయలలిత భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. జయలలిత భౌతిక కాయానికి ఆమె నిశ్చెలి శశికళ అంతిమ సంస్కారం నిర్వహించారు.

Don't Miss