రేవంత్ మరో పోరుబాట..

10:16 - December 8, 2016

హైదరాబాద్ : తెలుగుదేశం తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోపోరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టుబోతున్నారు. నిన్నటి వరకు రైతు పోరుయాత్రలతో తెలంగాణలోని పలు జిల్లాల్లో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకున్న రేవంత్ ఇప్పుడు విద్యార్థుల సమస్యలపై పోరాడేందుకు నడుం బిగిస్తున్నారు. ఈపోరాటం వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి మొదలుపెట్టనున్నారు.

యూనివర్సిటీ విద్యార్థులతో విద్యార్థి పోరు కార్యక్రమం
తెలంగాణలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్న విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి ఇచ్చిన హమీలను ఎంతవరకు నెరవేర్చింది అనే అంశాలను యూనివర్సిటీ విద్యార్ధులతో టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చర్చించున్నారు. బోధనా రుసుము చెల్లింపులు, యూనివర్సిటీలు నెలకొల్పడంలో ప్రభుత్వ చర్యలు, ఉపాధి అవకాశాలు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య తదితర అంశాలు కూడా విద్యార్థి పోరు కార్యక్రమంలో విద్యార్థులతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు.

రేషనలైజేషన్ పేరుతో 3,224 పాఠశాలలను మూసివేత
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యావిధానం ఎంతవరకు ఆశాజనకంగా ఉంది...ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు బోధనా రుసులు చెల్లించడంలో ప్రభుత్వ చూపిస్తున్న ఉదాసీన వైఖరి...రేషనలైజేషన్ పేరుతో 3 వేల 224 పాఠశాలలను మూసివేయడం......పాఠశాలలలో మౌలిక సదుపాయాల లేమి... ఉద్యోగాల భర్తీ లాంటి అంశాల విషయంలో ప్రభుత్వ తీరుపై విద్యార్థి లోకంతో చర్చించేందుకు రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేస్తున్నారు.

తెలుగునాడు విద్యార్థి విభాగం, తెలుగు యువత ఆధ్వర్యంలో విద్యార్థి పోరు
విద్యార్థి పోరు కార్యక్రమాన్ని తెలుగునాడు విద్యార్థి విభాగం, తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించేందుకు టీడీపీ నేతలు సన్నాహలు చేస్తున్నారు. రైతు పోరుయాత్రలో కీలక పాత్ర పోషించిన వేం నరేందర్ రెడ్డితో పాటు పార్టీ మహిళా నేత సీతక్క ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన మరో నేత రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు గండ్ర సత్యనారాయణ కూడా విద్యార్థి పోరు కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

వరంగల్ లో మకాం వేసిన తెలుగు యువత నాయకులు
తెలుగు యువత నాయకులు వారం ముందు నుంచే వరంగల్ లో మకాం వేసి విద్యార్థులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రైతు పోరు యాత్ర జరిగినట్లే విద్యార్థి పోరు కార్యక్రమం కూడా సజావుగా సాగేందుకు టీడీపీ ముఖ్యనేతలందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై ప్రయోగిస్తున్న పదునైన విమర్శల ప్రభావం ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకునే ప్రయత్నం స్ధానిక నేతలు చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ చేసిన రైతు పోరు యాత్రకు ప్రజలు మంచి సంఘీభావం తెలపడంతో మంచి జోష్ మీదున్న టీడీపీ నేతలు విద్యార్థి పోరు కార్యక్రమంలో కూడా విద్యార్థి లోకం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

Don't Miss