టి.అసెంబ్లీ..రచ్చేనా..

21:27 - December 7, 2016

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల‌కు షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 16 నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వారం రోజుల పాటు సమావేశాల్ని నిర్వహించాలని సర్కారు భావిస్తోంది.. రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నోట్ల రద్దుపై ఈ సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అటు రైతులకు రుణమాఫీ అమలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలుపై ప్రతిపక్షాలు ఇప్పటికే పోరుబాటపట్టాయి.. నోట్ల రద్దుతో జనాలు ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడంలేదని విమర్శిస్తున్నాయి.. ఈ సమస్యలపై చర్చించేందుకు తక్షణం అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేశాయి. అసెంబ్లీ గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టాయి.

జీఎస్టీ బిల్లు..
ఆగస్టు 30న జీఎస్‌టీ బిల్లుకోసం అసెంబ్లీని ఒక్కరోజు సమావేశపరిచింది ప్రభుత్వం.. ఆ తర్వాత శాసనసభను ప్రోరోగ్‌ చేసింది.. ఇలా ఒక్కరోజు అసెంబ్లీని ముగించడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రతిపక్ష పార్టీలు... శీతాకాల సమావేశాలను పూర్తిస్థాయిలో వాడుకోవాలని చూస్తున్నాయి. ప్రధాన సమస్యలపై సర్కారు తీరును అసెంబ్లీ వేదికగా ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. అటు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు అధికారపక్షం కూడా రెడీ అయింది.. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ నెల 15న టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో చర్చించబోతోంది. ఈ నెల 14న కలెక్టర్ల సమావేశం కూడా నిర్వహించబోతోంది. కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి రిపోర్ట్‌ తీసుకోవాలని చూస్తోంది.. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రతిపక్షాలను కట్టడిచేయాలని ఆలోచిస్తోంది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల కోసం అధికార, ప్రతిపక్ష సభ్యులు అస్త్రశస్త్రాలతో రెడీ అవుతున్నాయి.

Don't Miss