భగవంతునికి భక్తునికి స్వైపింగ్..

09:47 - December 7, 2016

ప్రకాశం : పెద్ద నోట్ల రద్దుతో పాతనోట్లకు దేవుని హుండీయే సరైన స్ధావరంగా మారింది. దీంతో దేవాలయాల్లో హుండీల స్థానంలో స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేయాలన్నడిమాండ్లు ఊపందుకుంటున్నాయి. తాజా పరిణామాలు దేవాలయాల్లో స్వైపింగ్‌ ప్రాధాన్యతను ప్రస్తావిస్తున్నాయి. దేవాలయాల్లో స్వైపింగ్ యంత్రాల ఏర్పాటు డిమాండ్ పై ప్రత్యేక కథనం.

దేవుడికి విరాళాలు, కానుకల రూపంలో నగదు, నగలు
దేవుడు చేసిన మనుషులు దేవుడికే కష్టాలు తెచ్చిపెట్టారు. దేవుడికి విరాళాలు, కానుకల రూపంలో ఇచ్చే నగదు, నగలకు లెక్కలు తేలేది ఎలా? ఈ డబ్బులు ఈ నగలు భక్తితో ఇస్తున్నారా... లేదా పాపం దేవుడిదే అని తలచి వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారా? తాజాగా దేవాలయాల్లో వెలుగు చూస్తోన్న పరిణామాలు నూతన ఆలోచనలకు నాంది పలుకుతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు పెద్దనోట్ల రద్దు వివాదం దేవాలయాల చూట్టూ ప్రదక్షిణలు చేస్తోంది.

దేవుడిని సైతం వదలని నోట్ల రద్దు..దేవాలయాల్లో పెరిగిన ఆదాయాలు
మోడీ పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో సంఘటిత, అసంఘటిత రంగాలు ఇప్పటికే కుదేలైపోయాయి.వ్యాపార లావాదేవీలు చతికిలబడిపోయాయి. ఇలా ప్రతిరంగాన్ని విలవిలలాడించిన రద్దు వ్యవహారం దేవుడిని సైతం వదలడంలేదు. నల్లధన భారం దేవుడే మోయాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా దేశ వ్యాప్తంగా వున్న దేవాలయాల్లో పెరిగిన ఆదాయాలు.... అందునా రద్దైన నోట్ల వరద మిన్నంటింది.

హుండీల స్థానంలో స్వైపింగ్ యంత్రాలు పెట్టాలంటున్న హేతువాదుల
ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం ఇదే విషయమై హేతువాదులు, ఆలయ పరిరక్షకుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దేవాలయాల్లో హుండీల స్థానంలో స్వైపింగ్ యంత్రం పెడితే నల్లకుబేరులు చాలామంది వలలో చిక్కుకుంటారని హేతువాదులు అభిప్రాయపడుతున్నారు.

స్వైపింగ్ యంత్రాలపై స్పందించిన దేవాదాయ శాఖ
దేవాదాయ శాఖ కూడా స్వైపింగ్ పై స్పందిస్తోంది. దేశంలో నగదు రహిత లావాదేవీలు అమలు చేస్తోన్న నేపధ్యంలో..... హుండీ విరాళాలు మినహా అన్ని లావాదేవీలకు స్వైపింగ్ వర్తించేలా నగదురహిత విధానాన్ని అమలులోకి తెస్తున్నట్టు దేవాదాయ అధికారులు చెబుతున్నారు. అయితే కానుకల విషయంలో స్వైపింగ్ కష్టమని, అది అనవసరమని అంటున్నారు. ఏది ఏమైనా దేవునికి సమర్పించే కానుకలపై జరుగుతోన్న స్వైపింగ్ చర్చకు స్వస్థి పలకాల్సిన అవసరముంది. లేకుంటే మోడీ నోట్ల రద్దు డొల్లతనం మరింతగా దారితప్పే ప్రమాదం పొంచివుందనేది మేధావుల భావన.

 

Don't Miss