రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది..ఇక ఉపరాష్ట్రపతి ?

18:10 - July 17, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. ఇక ఉప రాష్ట్రపతి ఎన్నిక తెరపైకి వచ్చింది. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే రామ్ నాథ్ కోవింద్ ను నియమించిన సంగతి తెలిసిందే. మిత్రపక్షాలు మీరా కుమార్ ను నియమించారు. కాసేపటి క్రితం పోలింగ్ ముగిసింది. అనంతరం ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ఎవరిని నియమించనున్నారనే దానిపై చర్చ ప్రారంభమైంది. దీనిపై ప్రతిపక్షాలు ముందుగానే ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీలు తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మహాత్మాగాంధీ మనువడు, పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీని ఎంపికచేశాయి.

బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్..
ఉప రాష్ట్రపతి అభ్యర్థి విషయంపై చర్చించడానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ లో 12 మంది సభ్యులు ఓ తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్య నాయుడే అని బీజేపీ ప్రచారం చేస్తోంది. కానీ విద్యాసాగర్ రావుతో పాటు ఇతర పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. దక్షిణాదికి చెందిన నాయకుడికే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నియమించాలని బీజేపీ యోచిస్తోంది. వెంకయ్య అభ్యర్థిత్వంపై ప్రధాని మోడీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఎన్డీయే పక్షాలతో మంతనాలు కొనసాగుతున్నాయి. కానీ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడిని ప్రకటిస్తే రానున్న ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై బీజేపీ యోచిస్తోంది. ఉప రాష్ట్రపతి అనంతరం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాల్సి వస్తుందనే విషయం తెలిసిందే. కానీ ఇందుకు వెంకయ్య నాయుడు సుముఖంగా లేరని సమాచారం.

విద్యా సాగర్ రావు..వెంకయ్య నాయుడుల్లో ఎవరికి అవకాశం దొరుకుతుంది.. చివరి నిమిషంలో అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వస్తుందా? వేచి చూడాలి.

Don't Miss