స్వలింగ సంపర్కం నేరం కాదు..

08:19 - September 7, 2018

ఢిల్లీ : స్వలింగ సంపర్కంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. స్వలింగ సంపర్కం ఇకపై నేరం కాదు.. స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. అందరిలాగే స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించడం విశేషం. తాజా తీర్పుతో సెక్షన్‌ 377పై కొనసాగుతున్న వివాదానికి తెరపడింది.
సుప్రీంకోర్టు తుది తీర్పు
స్వలింగ సంపర్కంపై ఐపిసి సెక్షన్‌ 377 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు  తుది తీర్పును వెల్లడించింది. పరస్పర అంగీకారంతో జరికే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు చెప్పింది. చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పు వెలువరించింది. 
జంతువులతో లైంగిక చర్య, చిన్నారులతో అసహజ శృంగారం నేరం 
వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కని...స్వలింగ సంపర్కులకు కూడా రాజ్యాంగం ప్రకారం అన్ని సమాన హక్కులు లభిస్తాయని కోర్టు స్పష్టం చేసింది. లైంగిక స్వభావం ఆధారంగా ఒకరిపై పక్షపాతం చూపడమంటే వారి ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేననే తెలిపింది. ఎల్‌జిబిటి సముదాయాన్ని అందరూ గౌరవించాలని...వీరిపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రభుత్వం ప్రచారం నిర్వహించాలని సూచించింది. సుప్రీం తీర్పుతో సెక్షన్‌ 377పై 150 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెర పడింది. జంతువులతో లైంగిక చర్యను, చిన్నారులతో అసహజ శృంగారం మాత్రం నేరంగానే పరిగణించాలని కోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పును ఎల్‌జిబీటీ కార్యకర్తలతో పాటు పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కొత్త శకానికి నాందిగా పేర్కొన్నారు. ఈ విషయంలో తనను తప్పు పట్టిన బిజెపి ఎంపీలకు ఈ తీర్పు చెంప పెట్టులాంటిదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ అన్నారు.
377 సెక్షన్‌ను సవాల్‌ చేస్తూ పిటిషన్ 
సెక్షన్‌ 377 ప్రకారం స్వలింగ సంపర్కం, జంతువులతో లైంగిక చర్యలు, అసహజ శృంగారానికి పాల్పడినవారికి పదేళ్ల వరకు జైలుశిక్ష, జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉంది. 377 సెక్షన్‌ను సవాల్‌ చేస్తూ నాజ్‌ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ 2001లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇద్దరు వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్యను నేరంగా పరిగణించకూడదని 2009లో ఢిల్లీ  హైకోర్టు తీర్పు చెప్పింది. 2013లో ఈ తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది.  సెక్షన్‌ 377 చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జులై 17న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ సుప్రీంకోర్టు తాజా తీర్పునిచ్చింది.

 

Don't Miss