కేంద్రానికి సుప్రీంకోర్టు చురకలు

21:45 - December 9, 2016

ఢిల్లీ : పెద్ద నోట్ల ర‌ద్దుపై సుప్రీంకోర్టు కేంద్రంపై ప్రశ్నలు సంధించింది. నోట్ల ర‌ద్దు నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు. బ్యాంకుల నుంచి వారానికి 24వేల రూపాయ‌లు మాత్రమే విత్ డ్రా చేయాల‌న్న ప‌రిమితి ఎందుకు విధించార‌ని సుప్రీంకోర్టు చుర‌క‌లు అంటించింది. దీనిపై కేంద్రం వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు విచార‌ణ‌ను 14వ తేదీకి వాయిదా వేసింది. 
సుప్రీంకోర్టులో విచారణ
పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీనియ‌ర్ న్యాయ‌వాది ప్రశాంత్ భూష‌ణ్‌, కేంద్రం త‌రుపున అటార్ని జ‌న‌ర‌ల్ ముఖుల్ రోహిత్గీ వాద‌న‌లు వినిపించారు. ఏటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని లాయ‌ర్ ప్రశాంత్ భూష‌ణ్ వాద‌న‌లు వినిపించారు. పెద్ద నోట్ల ర‌ద్దుతో బ్యాంకుల్లో డ‌బ్బులేక ప్రజ‌లు క‌నీస అవ‌స‌రాల‌ను కూడా తీర్చుకునే ప‌రిస్థితిలో లేర‌ని వివ‌రించారు. ఏటీఎంల‌లో సాఫ్ట్‌వేర్ స‌మ‌ర్థవంతంగా చేయ‌లేద‌న్న ఆయ‌న‌.. కొత్త నోట్ల పంపిణీ విష‌యంలో స‌హ‌కార బ్యాంకుల ప‌ట్ల ప‌క్షపాతం చూపార‌ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 
నోట్ల ర‌ద్దు నిర్ణయాన్ని స‌మ‌ర్థించుకున్న కేంద్రం 
అయితే పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స‌మ‌ర్థించుకుంది. మ‌రో ప‌ది నుంచి ప‌దిహేను రోజుల్లో అంతా స‌ర్దుమ‌ణుగుతుంద‌ని వివ‌ర‌ణ ఇచ్చింది. నోట్ల ర‌ద్దుపై ఎక్కడా ఒక్క కేసు కూడా న‌మోదు కాలేద‌ని చెప్పుకొచ్చింది. కావాల‌నే కొన్ని రాజ‌కీయ పార్టీలు వాస్తవాల‌కు మించి త‌మ గొంతును వినిపిస్తూ అల‌జ‌డి సృష్టించే ప్రయ‌త్నం చేస్తున్నాయ‌ని రోహిత్గీ వాదించారు. దీనిపై ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. వారానికి 24వేల రూపాయ‌లు మాత్రమే డ్రా చేసుకోవాల‌నే నిబంధ‌న‌పై ప్రశ్నించింది. నగదు రద్దుకు, పరిమితికి సంబంధం ఏంటని వివరణ కోరింది. ప్రతి ఒక్కరికి కొత్త న‌గ‌దు అందాల‌నే ప‌రిమితి విధించిన‌ట్లు కేంద్రం తెలిపింది. నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే నాటికి ప్రభుత్వం వద్ద ముందే సిద్ధం చేసిన కొత్త నోట్లేమీ లేవని అట‌ర్నీ జ‌న‌ర‌ల్ స్పష్టం చేశారు. ముందే ముద్రిస్తే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం లీక‌వుతుంద‌నే అలా చేశార‌ని చెప్పుకొచ్చారు. ఇరువురి వాద‌న‌లు విన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ సారథ్యంలోని త్రిసభ్య ధర్మాసనం... కేసు తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది.

Don't Miss