స్టాంప్ ఒప్పందాలతో భార్యలను 'అద్దె' కి..

11:00 - July 4, 2018

మధ్యప్రదేశ్ :    ఇళ్లు అద్దెకిస్తాం..షాప్స్ అద్దెకిస్తాం..కార్యాలయాలు అద్దెకిస్తాం..ఇలా వస్తువులు..ఆస్తులు వంటివి అద్దెకివ్వటం మనం చూస్తుంటాం..వింటుంటాం. కానీ మనుష్యులను అందులోని మహిళలను అద్దెకివ్వటం అనే అమానవీయ సంఘటనలు కూడా సభ్య సమాజంలో చోటుచేసుకుంటున్న దుస్థితి గురించి వింటేనే ఒళ్లు గగ్గుర్పొడిచేలా చేస్తున్నాయి.

ఈ పరిస్థితులకు కారణమేమిటి?..
పశువులను విక్రయిస్తున్నట్లుగా..అద్దెకిస్తున్నట్లుగా కొనసాగుతున్న ఈ అమానవీయ పరిస్థితులకు కారణం ఏమిటి? ఎవరు కారణం? పాలకులా? సమాజమా? పేదరికమా? జల్సాలకు అలవాటు పడుతున్న వైనమా? డబ్బు కోసం దేనికైనా దిగజారే అమానవీయతా? లేక ఏ దారీ లేక కుటుంబం కోసం కొనసాగుతున్న బలిదానమా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతారు? ఈ పరిస్థితులకు బాధ్యులెవరు? అనే ప్రశ్నలు ఉద్భవించకమానవు. పరిస్థితులు ఏవైనా బలి పశువుగా మారేది మాత్రం మహిళలే అనే వాస్తవం మరోసారి ఇటువంటి పరిస్థితుల ద్వారా, ఘటనల ద్వారా బైటపడింది.

చరిత్రలో గ్వాలియర్ ప్రసిద్ధి..
దక్షిణాన 122 కి.మీ. దూరానవున్నది. భారత్‌లోని అత్యధిక జనాభాగల నగరాలలో దీని స్థానం 46వది. ఇంతి జనాభా కలిగిన నగరం గ్వాలియర్. స్వాతంత్ర్య సమరం జరుగుతున్న సమయంలో గ్వాలియర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఝాన్సీ బ్రిటిష్ పరం అయ్యాక ఝాన్సీ లక్ష్మీభాయి గ్వాలియర్ కోటలో ఆశ్రయం కోరాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి భయపడి గ్వాలియర్ రాజు రాణిభాయికి ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించాడు. అయినప్పటికీ సైన్యం రాణిభాయి మీద గౌరవంతో కోటలో ఆశ్రయం ఇవ్వడానికి మద్దతు తెలిపారు. ఏమాత్రం ఎదిరింపు లేకుండా రాణిభాయి కోటలో ప్రవేశింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాణిభాయి కొరకు గ్వాలియర్ కోటమీద దాడి చేసింది. ఝాన్సీరాణి అపారమైన బ్రిటిష్ సైన్యంతో తన స్వల్పసైన్యం సాయంతో అత్యంత సాహసోపేతంగా పోరాడి చరిత్రలో నిలిచిపోయింది. గ్వాలియర్ కోట బ్రిటిష్ స్వాధీనం చేసుకుంది. ఆనాటి మరపురాని చారిత్రక సంఘటనకు గ్వాలియర్ కోట సాక్ష్యంగా నిలబడింది. ఇంతటి చరిత్ర కలిగిన గ్వాలియర్ లో ఇటువంటి అమానవీయ ఘటనలకు భారత దేశ చరిత్రకు..వివాహ వ్యవస్థకు మాయని మచ్చను కలిగిస్తున్నాయి.

గ్వాలియర్ లో బైటపడిన అమానవీయత..
మధ్యప్రదేశ్‌ లో తాజాగా వెలుగు చూసిన విషయాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. విషయం తెలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. గ్వాలియర్ డివిజన్‌లో పలువురు పురుషులు తమ భార్యలను సంపన్నులకు అద్దెకిస్తున్న విషయం తెలిసి సభ్యసమాచారం ఒక్కసారిగా నివ్వెరపోయింది.

విలాస వస్తువుగా మారుతున్న ఆడపుట్టుక..
ఆడ పుట్టుక ఓ విలాస వస్తువుగా మారబడుతున్న క్రమంలో మానవ విలువలు పాతరేయబతున్నాయి. వస్తువులను అద్దెకు తెచ్చుకున్నట్లుగా మహిళలను అద్దెకు తెచ్చుకుని వారి అవసరాలకు వాడుకుంటున్న ఘటనలు సమాజాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇదేనా మహిళలకు ఇచ్చే విలువ అనే ప్రశ్నిస్తున్నాయి. కానీ వారికి మాత్రం ఎన్నటికీ సమాధానం దొరకని ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి.

సంపన్నులకు భార్యలను అద్దెకిస్తున్న ప్రబుద్ధులు..
సంపన్న కుటుంబాలకు చెందిన అవివాహితులు, భార్యలను కోల్పోయిన వారికి శివపురి జిల్లాలోని భర్తలు తమ భార్యలను రోజు, నెల వారీ, ఏడాది పద్ధతిలో అద్దెకు ఇస్తున్నారు. స్టాంప్‌ పేపర్‌పై రాసుకుని మరీ ఒప్పందాలు కుదర్చుకుంటుండడం విశేషం. ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఆ వ్యక్తి ఆ మహిళతో సంబంధాన్ని కోరుకుంటే ఆ ఒప్పందం పునరుద్ధరిస్తారు. గతంలో గుజరాత్‌లోనూ ఇటువంటి ఉదంతాలు వెలుగు చూశాయి. ఓ వ్యక్తి తన భార్యను నెలకు రూ. 8 వేలకు మరో వ్యక్తికి అద్దెకివ్వడం అప్పట్లో సంచలనమైంది.

పెళ్లి పేరుతో శ్రుతి మించుతున్న అరాచకాలు..
మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో పెళ్లి పేరుతో జరుగుతున్న అరాచకాలు ఇటీవల శ్రుతి మించాయి. గిరిజన బాలికలపై కన్నేసిన బ్రోకర్లు వారికి పెళ్లిళ్లు చేస్తామని, చక్కని వరుడు ఉన్నాడని వారి తల్లిదండ్రులను ఒప్పిస్తారు. అబ్బాయి నుంచి వేలాది రూపాయలు తీసుకుని కొంత మొత్తాన్ని అమ్మాయి తల్లిదండ్రుల చేతుల్లో పెడతారు. నిజానికి ఇవి పెళ్లిళ్లు ఎంతమాత్రమూ కాదు. పెళ్లి పేరుతో జరుగుతున్న విక్రయాలు మాత్రమే. ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగులోకి వస్తున్న ఈ అరాచకాలు విస్మయపరుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. 

ఆడపుట్టుకపై అరాచకాలు..
కడుపులో వుండగానే ఆడపుట్టుకని చిదిమేస్తున్న వైనం ఒకవైపు. పుట్టిన తరువాత బతికేందుకు..మనుగడ సాగించేందుకు..ఉనికి నిలుపుకునేందుకు..వ్యక్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఇలా ప్రతి క్షణం ఆడపుట్టుక పోరాటం చేస్తునే వుంది. వీటి మధ్య ఎన్నో వేధింపులు, హింసలు, అరాచకాలు..దాడులు..హత్యలు..ఆంక్షలు..అక్రమ రవాణా..పండంటి బతుకులను బుగ్గిపాలు చేస్తు పడుపు వృత్తుల్లోకి నెట్టబడుతున్న అఘాయిత్యాలు.. ఇలా చెప్పుకుంటు పోతే ఈ భూగోళం కూడా సరిపోదేమో. వీటికి తోడు మహిళలను బలి పశువులుగా మార్చేస్తు..ప్రాణం లేని,చలనం లేని వస్తువులను విక్రయిస్తున్నట్లుగా..అద్దెకిస్తున్నట్లుగా రోజుకు, వారానికి, నెలకు,సంవత్సరానికి భార్యలను అద్దెకిస్తున్న దౌర్భాగ్యపు పరిస్థితుల పట్ల పాలకులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవుసరముంది. మహిళ ఓట్లపై గెలిచి మహిళ మానాభిమానాలతో వ్యాపారం చేస్తున్న ప్రభుత్వాలు ఈ దౌర్భాగ్యపు దుస్థితికి సమాధానం చెప్పాలి..చెప్పి తీరాలి. దీనికి సమాజం కూడా బాధ్యత వహించాల్సిన అవుసరం కూడా ఎంతైనా వుంది. 

Don't Miss