నగరంలో పేక మేడలు...

21:00 - December 9, 2016

హైదరాబాద్ : మహానగరంలో మనుషుల ప్రాణాలకు లెక్కలేకుండా పోతోంది. పొట్టకూటి కోసం భవన నిర్మాణ పనులకెళ్లిన కూలీల బతుకులు శిథిలమవుతున్నాయి. అధికారుల అలసత్వం, బిల్డర్ల ధనదాహానికి అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లో భవనాలు పేకమేడలా కూలిపోతున్నా బల్దియా పాఠాలు నేర్వడం లేదా? ఈ ప్రమాదాలకు ఫుల్‌స్టాప్‌ పడేదెప్పుడు? 
కుప్పకూలిన 7 అంతస్థుల భవనం  
హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడ ప్రాంతం..సమయం రాత్రి తొమ్మిది గంటలు..7 అంతస్తుల భవనం...పనులు ముగించుకున్న కార్మికులు సేద తీరుతున్నారు. సడన్‌గా పెద్ద శబ్దం రావడంతో భూకంపం వస్తుందేమోనని అంతా భయపడిపోయారు. ఏం జరిగిందో తెలుసుకునే వ్యవధి లేదు. బయటకు దూకే సమయం లేదు. అంతలోనే 7 అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. భవనం సెల్లార్‌లో ఉంటున్న 20 మంది కూలీలు శిథిలాల మధ్య ఇరుక్కుపోయారు. ఆర్తనాదాలతో, అరుపులతో ఆ ప్రాంతం ఒక్కసారిగా భయానకంగా మారింది. కొందరు సజీవసమాధి కాగా.. మరికొందరు క్షతగాత్రులయ్యారు. 
నిర్మాణ పనులు నాసిరకం
నానక్‌రామ్‌గూడలో 7 అంతస్తుల భవనం పేకమేడలా కూలిపోవడానికి కారణాలు ఏమిటి? నిర్మాణ పనులు నాసిరకంగా చేపట్టినా.. జీహెచ్‌ఎంసీ అధికారులు ఎందుకు మౌనంగా ఉండిపోయారు. తిలాపాపం తలపిడికెడు అన్నట్లుగా కూలీల మరణాలకు బాధ్యులెవరు. టోలిచౌకి ప్రాంతానికి చెందిన తుల్జాపూర్‌ సత్యనారాయణ సింగ్‌ ఈ భవనం యజమాని. ఆయన కేవలం 260 గజాల స్థలంలో ఏకంగా జీప్లస్‌ 6తో పాటు పైన పెంట్‌హౌస్‌ కూడా నిర్మిస్తున్నాడు. 2015 సెప్టెంబర్‌ నుంచి ఈ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సెల్లార్‌లో 14 కుటుంబాలకు చెందిన 30 మంది కూలీలు నివసిస్తున్నారని తెలుస్తోంది. నిర్మాణం నాసిరకంగా ఉందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 16 పిల్లర్లు నిర్మించినా.. పుట్టింగ్‌లు సరిగా లేవన్న  ఆరోపణలున్నాయి. మరోవైపు కూలిపోయిన అపార్టుమెంటును ఆనుకునే సుమధుర అనే నిర్మాణ సంస్థ మరో భారీ వెంచర్‌ నిర్మిస్తోంది. సెల్లార్‌ కోసం 50 అడుగుల లోతున తవ్వకాలు చేపట్టడం వల్లే 7 అంతస్తుల భవనం కుప్పకూలిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. డైనమెట్లతో పేల్చి సెల్లార్‌ గుంత తీస్తుండడమే  ప్రమాదానికి కారణమని మరికొందరు చెబుతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా భవనాన్ని నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిర్మాణదారుల నిర్లక్ష్యం, అత్యాశ 
ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని తెలుసు.. గతంలో జరిగిన ఘోరాలు తెలుసు.. అన్నీ తెలిసినా నిర్మాణదారుల నిర్లక్ష్యం, అత్యాశ గ్రేటర్‌ హైదరాబాద్‌లో భవనాలు పేకమేడలవడానికి కారణాలవుతున్నాయి. ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా.. నిర్మాణ సమయంలోనే కట్టడాలు కుప్ప కూలుతున్నాయి. బిల్డర్ల ధనదాహానికి ఎందరో కూలీలు బలవుతున్నారు. భవనాల నిర్మాణాలకు తీసుకునే అనుమతి ఒకటి అయితే చేపట్టే నిర్మాణాలు మరోలా ఉంటున్నాయి. నిర్మాణ లోపాలు గుర్తించి అరికట్టాల్సిన జీహెచ్‌ఎంసీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో ప్రమాదాలకు అడ్డుకట్ట పడటం లేదన్నది బహిరంగ రహస్యం. మహానగరంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా బల్దియా పాఠాలు నేర్వడం లేదు. నిర్మాణంలో ఉన్న భవనాలు కూలుతున్నా పర్యవేక్షణ కొనసాగడం లేదు. కాంట్రాక్టర్లు ప్రమాణాలు వదిలేసినా కాసుల కక్కుర్తితో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
జులైలో ఫిల్మ్‌నగర్‌లో పోర్టికో కూలి ఇద్దరు మృతి 
ఈ ఏడాది జులైలో ఫిల్మ్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న పోర్టికో కూలి ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై నివేదికతో పాటూ ప్రమాదాలకు దారితీస్తున్న సాంకేతిక అంశాలను జేఎన్‌టీయూహెచ్‌ నిపుణులు వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న భవనాలు కుప్పకూలడానికి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, నైపుణ్యంలేని ఇంజినీరింగ్‌ పనులు, డిజైనింగ్‌ లోపాలే కారణమని తేల్చారు. వేగంగా పనులు పూర్తిచేయాలనే తొందరలో అంతస్తులపై అంతస్తులను నిర్మిస్తున్నారు. పరిమిత ఎత్తు దాటకుండా ఉండేందుకు  సెల్లారు కోసం మూడు నాలుగు అంతస్తుల లోపల వరకు తవ్వుతున్నారు. దీంతో నిర్మాణ భవనాల పక్కన ఉన్న కట్టడాలకు ఇది ముప్పుగా మారుతోంది. 
జులైలో పదిరోజుల వ్యవధిలో 4 వరుస ప్రమాదాలు 
ఈ ఏడాది జులై నెలలో పదిరోజుల వ్యవధిలో నాలుగు వరుస ప్రమాదాలు జరిగాయి. ఏడుగురు కూలీల ప్రాణాలు కోల్పోయారు. ఆగస్ట్ 2న చిలకలగూడలో పాత భవనం కూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇదే నెలలో జూబ్లీహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనంలో.. మొదటి అంతస్తు పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. నిర్మాణ నాణ్యతను, అధికారుల పర్యవేక్షణ ఏపాటిదో చెప్పాయి. గత ఆగస్టులో మాదాపూర్‌లోనూ నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కూకట్‌పల్లి వసంత్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు కార్మికులు చనిపోయారు. గతేడాది జూన్‌ 23న షేక్‌పేటలోని సత్యాకాలనీలో నాలుగంతస్తుల భవనం కూలి ఇద్దరు గాయపడ్డారు. 2013 జూలై 9న సికింద్రాబాద్‌లో భవనం కుప్పకూలి 13 మంది చనిపోయారు. 2012 ఫిబ్రవరి 26న సికింద్రాబాద్‌ మొండా మార్కెట్‌ ప్రాంతంలో భవనం కూలి  ముగ్గురు మృత్యువాతపడ్డారు.
కూలిపోయేందుకు సిద్ధంగా 1,997 భవనాలు
కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న 1,997 భవనాలను జీహెచ్‌ఎంసీ గుర్తించినప్పటికీ వాటిలో1000 భవనాలను మాత్రమే తొలగించినట్లు తెలుస్తోంది. మిగతావాటిలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఏటా పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలుతున్నాయి. అమయాకుల ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. అక్రమాలపై ఉక్కపాదం అంటూ చేసే ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితం చేస్తున్నాయి. అనుమతుల్లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టినా.. కాసుల కక్కుర్తితో చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు. మాముళ్ల మత్తు.. రాజకీయ పలుకుబడి.. వెరసి.. అక్రమ నిర్మాణాలపై కన్నెత్తి చూసేందుకే వెనుకంజ వేస్తున్నారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం కాకుండా..అక్రమ నిర్మాణాల చేపడుతున్నవారిపై జీహెచ్‌ఎంసీ అధికారుల కొరడా ఝుళిపించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. 

 

Don't Miss