రియాల్టీ రంగంపై 'నోట్ల' ఎఫెక్ట్ ఉందా ?

19:35 - December 4, 2016

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లోని రియల్టీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నగదు రూపంలో జరిగిన స్థిరాస్తి లావాదేవీలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు లేక ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పడం ఇందుకు నిదర్శనం. విభజన తర్వాత అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో రియల్ బూమ్ ఊపందుకొంది. ముఖ్యంగా ఏపీ కొత్త రాజధాని అమరావతి, విశాఖపట్నంలతో పాటు మిగతా జిల్లాల్లోనూ భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. అమరావతి, అమరావతి చుట్టూ భూముల ధరలు హైదరాబాద్ కంటే ఎక్కువ పలుకుతున్నాయి. ఇక తెలంగాణలోనూ ప్రధానంగా రాజధాని హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో రియల్ బూమ్ పెరిగింది. జిల్లాల విభజనతో ఇది మరింత స్పీడ్ అందుకొంది. కానీ తాజాగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వ్యవహారం రియల్ రంగానికి చుక్కలు చూపబోతోందని నిపుణులు అంటున్నారు.

నగదు రూపంలో జరిగే స్థిరాస్తి లావాదేవీలన్నీ కుదేలే..
తెలంగాణలో సగటున రోజుకు 3 వేల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరుగుతాయి. పెద్ద నోట్ల రద్దుతో రోజుకు దాదాపు 200 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతున్నాయి. సాధారణంగా రియల్టీ రంగంలో స్థలాలు, విల్లాలు, ప్రీమియం ఫ్లాట్ల కొనుగోళ్లలో మెజార్టీ భాగం నగదు రూపంలోనే లావాదేవీలు జరుగుతాయి. అందుకే ఆయా విభాగాలపై భారీగా ప్రభావం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. రియాల్టీ ఎక్కువుగా ఉన్న హైదరాబాద్ నగరంలో 40-60 శాతం గృహాలు అందుబాటులో ఉన్నాయి. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, శ్రీనగర్‌కాలనీ, గచ్చిబౌలి, కొండాపూర్ వంటి ప్రీమియం ప్రాంతాల్లోని ప్రాజెక్ట్‌లు, కొత్త జిల్లాల్లోని వెంచర్లు, స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లపై నోట్ల రద్దు ప్రభావం చూపుతోంది. మరోవైపు నోట్ల రద్దు నిర్ణయంతో ప్లాట్లు, ఇళ్ల ధరలు తగ్గుతాయని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సామాన్యుల సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్న చర్చ నడుస్తోంది.

పెద్ద నోట్ల రద్దుతో అపార్ట్‌మెంట్ల కొనుగోళ్లు పెరిగే ఛాన్స్..
పెద్ద నోట్ల రద్దు 30-60 లక్షల మధ్య ధరలుండే అపార్ట్‌మెంట్లకు మాత్రం కలిసొస్తుందని మరికొందరంటున్నారు. ఎందుకంటే ఈ విభాగంలో నగదు రూపంలో లావాదేవీలు జరిగేది కొంతే. 20-25 శాతం మాత్రమే ముందస్తు చెల్లింపులుగా నగదు రూపంలో తీసుకుంటారు. మిగిలినదంతా బ్యాంకు రుణంగా ఇస్తుంది. అందుబాటు గృహాల నిర్మాణదారులకు ప్రధాన పోటీదారులు పంచాయతీ లే-అవుట్లు, వెంచర్లు చేసే అసంఘటిత డెవలపర్లే. ఇప్పుడు నోట్ల రద్దుతో లావాదేవీలు, బదిలీలు లేక వారందరూ తెరమరుగైపోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు నిపుణులు.. దీంతో ఎన్నారైలు, ఐటీ ఉద్యోగులు, పెట్టుబడిదారులకు మిగిలిన విభాగాల్లో ఇన్వెస్ట్ చేసే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు.

Don't Miss