జననీ జన్మభూమిశ్చ..

18:48 - October 13, 2017

కరీంనగర్‌ : జననీ జన్మభూమిశ్చ అన్నారు. పుట్టిన ఊరిపై మమకారం అంత తేలిగ్గా వదిలేది కాదు. అందుకే కొంతమంది.. తాము ఎదిగిన కొద్దీ.. కన్నతల్లిలాంటి సొంతూరికి కాస్తో కూస్తో సేవ చేసి రుణం తీర్చుకుంటుంటారు. ఈ కోవకే చెందుతారు.. కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రభాకరరావు. సొంతూరికే కాదు.. చుట్టుపక్కలున్న పల్లెల అవసరాలూ తీరుస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోన్న ప్రభాకరరరావుపై 10 టీవీ ప్రత్యేక కథనం.

ఇక్కడ చూస్తున్న వ్యక్తి పేరు వీర్ల ప్రభాకర్‌రావు. ఉండేది కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచెల గ్రామం. ఒకప్పుడు ఈ గ్రామానికి వెళ్లాలంటే సరైన రోడ్డు కూడా ఉండేది. సాయంత్రం గ్రామంలో కనీసం వీధి దీపాలు కూడా లేకుండా అంతా అంధకారమే. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యంతో గ్రామం అభివృద్ధి కుంటుపడిపోయింది. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇది చూసిన ప్రభాకర్‌ రావు గ్రామాభివృద్ధిక కంకణం కట్టుకున్నారు. ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనులను ఈ పెద్దాయన చేస్తూ నేటి యువతకి ప్రజాప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

గ్రామస్తులకు ఏమి కావాలో ముందుగానే గుర్తించి వాటిని తీర్చడంలోనే తృప్తి చెందుతుంటారు ప్రభాకర్ రావు. 2014లో  నెల రోజుల పాటు నిపుణులైన వైద్యులతో హెల్త్ క్యాంప్ లను ఏర్పాటు చేసి గ్రామస్తులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. గ్రామంలో కట్టుదిట్టమైన భద్రత కోసం సిసి కెమెరాల ఏర్పాటు కోసం తన వంతు కృషిచేశారు. మంచి నీటి కోసం గ్రామస్థులు పడుతున్న బాధలను చూడలేక స్వంత నిధులతో బోర్లువేయించి శుద్ధ జలం కోసం ప్లాంట్‌ లను వేయించారు. రైతుల కోసం మండలంలో 50 లక్షల నిధులతో రామడుగు సహకార సంఘం భవన నిర్మాణం చేసి రైతులకు అంకితం చేశారు. అలాగే పొరుగు గ్రామాలైన షా నగర్‌, కుక్కెరకుంట, గోపాల్‌ రావు పేట, వెదిరతో పాటు మొత్తం 22గ్రామాల్లో తన సేవా కార్యక్రమాలను విస్తరించారు.

గ్రామంలో శిథిలావస్థలో ఉన్న పురాతన దేవాలయాలను పునర్నిర్మాణం చేయడంతో పాటు నూతన దేవాలయాలను కట్టించారు ప్రభాకరరావు. అంతే కాకుండా చిన్నజీయర్‌ స్వామి సూచనలతో కరీంనగర్ పట్టణంలో కూడా వేద భవనాన్ని నిర్మంపజేశారు. 

గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు ప్రతి యేటా పుస్తకాలను పంపిణీ చేసి తన ఔదార్యాన్ని చాటుకుంటారు ప్రభాకరరావు. విద్యే అభివృద్ధికి ఏకైక మార్గం అని భావించడం వల్లే.. పేద విద్యార్థులకు తనవంతు సహయసహకారాలు అందిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయించారు. ప్రతిపలం ఆశించకుండా గ్రామలను తనవంతుగా తీర్చిదిద్దుతు ప్రజా సేవకుడిగా ప్రజల మన్ననలను పొందుతున్నారు. తండ్రి ఆశయాల బాటలోనే తను కూడా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.. ప్రభాకరరావు. 

Don't Miss