ఉగ్రవాదుల కంటే దారుణంగా'పాత్‌హోల్స్'..

17:00 - July 16, 2018

ఉగ్రవాదం అనే పదం ఉగ్రము అనే పదం నుండి పుట్టింది. ఉగ్రము - భయం నుండి పుట్టినది. భయాన్నికలుగజేసే, భయపెటికట, లేదా ప్రమాదాన్ని కలుగజేసే విషయాల పట్ల 'మానసిక ప్రతిచర్య'. ఆత్మన్యూనతాభావనలకు, ఉద్రేకాలకు లోనై, ఇతరులకు భయపెట్టి తమ పంతాలను నెగ్గించుకొనువారు, తమ భావాలను, బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించేవారు, తమ స్వీయవిషయాల రక్షణకొరకు, సమాజవ్యతిరేక మార్గాలను ఎంచుకొనువారు - 'ఉగ్రవాదులు'. మానసికంగా చూస్తే ఇదో రుగ్మత. సామాజికంగా చూస్తే ఇదో పైశాచికత్వం, మతపరంగా చూస్తే ఇది నిషిద్ధం. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాల మూలంగా ఎంతో మంది అమాయకులైన ప్రజలు బలవుతున్నారు. కానీ పాత్ హోల్స్ అంతకంటే భయంకరంగా మనుషుల ప్రాణాలను తీసేస్తున్నాయి.

గుంతల్లో కలిసిపోతున్న ప్రాణాలు..
పాత్‌హోల్స్ అంటే రోడ్లపై ఏర్పడ్డ గుంతలు. దేశంలో ఉగ్రవాదుల కంటే ప్రమాదకరంగా మారుతున్నాయి. ఉగ్రవాదుల కంటే వీటి వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని లెక్కలు తెలియజేస్తున్నాయి. 2017 దేశవ్యాప్తంగా 803 మంది ఉగ్రదాడుల వల్ల ప్రాణాలు కోల్పోతే, పాత్‌హోల్స్ వల్ల ఏకంగా 3,597 మంది ప్రాణాలు కోల్పోయినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే రోజుకు సగటున పదిమంది ప్రాణాలు 'గుంతల్లో' కలిసిపోతున్నాయి.

పెరుగుతున్న గుంతల వల్ల పోతున్న ప్రాణాల సంఖ్య..
2016తో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ. మహారాష్ట్రలో మరణాల సంఖ్య ఏకంగా రెండింతలు అయింది. 2017లో నక్సల్స్, ఉగ్రవాదుల దాడుల వల్ల టెర్రరిస్టులు, భద్రతా సిబ్బంది, పౌరులు కలిసి మొత్తం 803 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో గుంతల్లో పడి 3,597 మంది మృతి చెందడం విషాదకరం.

అగ్రస్థానంలో వున్న ఉత్తరప్రదేశ్..
రోడ్డు గుంతల్లో పడి మరణిస్తున్న వారి సంఖ్యలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 2017లో యూపీలో ఏకంగా 987 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో 726 మంది, హరియాణాలో 522 మంది, గుజరాత్‌లో 228 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంతకుముందు ఏడాది ఆయా రాష్ట్రాల్లో సంభవించిన మరణాల కంటే ఇవి ఎక్కవ కావడం గమనార్హం. ఇక 2016లో ఆంధ్రప్రదేశ్‌లో 131 మంది గుంతల్లో పడి చనిపోయారు.

Don't Miss