ఎవరీ లక్ష్మణ్ రావు..ఏందా కథ..

21:19 - December 7, 2016

హైదరాబాద్ : ఐడీఎస్ పథకం క్రింద 9,800 కోట్ల ఆస్తులు ప్రకటించిన వ్యాపారి లక్ష్మణ్‌రావు ఇంట్లో ఐటీశాఖ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి మొదలయిన సోదాలు బుధవారం రాత్రిదాకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆస్తులకు సంబంధించి సమగ్ర వివరాలపై ఐటీ అధికారులు ఆరాతీస్తున్నారు. లక్ష్మణరావు ప్రకటించినట్లుగా అతని దగ్గర నిజంగానే అంతధనం ఉందా.. ఉంటే మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ కట్టకపోవడంలో ఆంతర్యం ఏమిటి. అతను ఎవరికైనా బినామీగా వ్యవహరిస్తున్నారా అన్న కోణంలో ఐటి అధికారులు విచారణ జరుపుతున్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఐడీఎస్‌ స్కీం నీరుగారుతోంది. భారీగా నల్లధనం ఉందని ఇటీవలే ప్రకటించిన ముంబై వ్యాపారి మహేశ్‌షా, తొలివిడత ట్యాక్స్‌ మొత్తాన్ని కట్టడంలో చేతులెత్తేశారు. తాజాగా.. 10వేల కోట్ల ఆస్తి ఉందని ప్రకటించిన హైదరాబాద్‌ వ్యాపారి లక్ష్మణ్‌రావు కూడా మొదటి ఇన్‌స్టాల్‌మెంటు చెల్లించకుండా ముఖం చాటేశాడు. దీంతో ఐటీ అధికారులు లక్ష్మణ్ రావు ఇళ్ళపై దాడులు మొదలు పెట్టారు. రెండు రోజులుగా ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

నీరుగారిందా ? 
ఓ ప్రైవేటు కంపనీలో జనరల్ మేనేజరుగా పనిచేసి రిటైర్ అయిన లక్ష్మణరావు..ఆ తర్వాత రియల్ఎస్టేట్‌ వ్యాపారిగా స్థిరపడ్డాడు. 2008లో BLR బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. రెండేళ్ల క్రితం ఫిల్మ్ నగర్‌లో 12 కోట్లు వెచ్చించి ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే లక్ష్మణ్‌రావుకు స్థిరాస్తి వ్యాపారంతో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో పలుచోట్ల లక్ష్మణ్‌రావుకు విలువైన ఆస్తులు ఉన్నట్లు ఐటి అధికారులు గుర్తించినట్లు సమాచారం. యాదాద్రి జిల్లా బీబీనగర్‌లో BLR వెంచర్ పేరుతో ఒక వెంచర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోదాల్లో లక్ష్మణ్‌రావు ఇంట్లో పలు కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే 10వేల కోట్ల ఆస్తులు ప్రకటించిన లక్ష్మణ్‌రావుకు నిజంగానే అంత ఆస్తి ఉందా..ఒకవేళ నిజంగానే అంత ఆస్తిపరుడయితే ఎందుకు మొదటి ఇన్‌స్టాల్‌మెంటు చెల్లించలేదు అనే విషయంపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఆస్తులు లేని పక్షంలో అతను ఎవరికైనా బినామీగా ఉన్నాడా అనే కోణంలో ఐటి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే భారీ మొత్తంలో నల్లధనం ప్రకటించిన గుజరాతీలు, ముంబై వాలాలు చేతులెత్తేయగా.. ఇప్పుడు హైదరాబాద్‌ వ్యాపారి లక్ష్మణ్‌రావు కూడా అదే జాబితాలో చేరారు. దీంతో ఐడీఎస్ పథకం అసలు లక్ష్యం నీరుగారిందన్న విమర్శలు వస్తున్నాయి. 

Don't Miss