సినీ రంగంలోజయ'ప్రస్థానం..

19:51 - December 6, 2016

జయలలిత కేవలం రాజకీయాల్లోనేకాదు... సినీమారంగంలోనూ ఆమె ఓ ప్రభంజనం. సినీవినీలాకాశంలో ధ్రువతారలా వెలుగొందారు. దక్షిణాది ప్రేక్షకుల మనస్సుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. జయలలిత సినీ ప్రస్థానంపై 10టీవీ కథనం... మత్తెక్కించే కళ్లు.. కిర్రెక్కించే డ్యాన్స్‌... మళ్లీమళ్లీ చూడాలనిపించే హావభావాలతో నాటికుర్రకారు గుండెలను లయతప్పించిన అద్భుతనటి జయలలిత. అత్యద్భుత నటనా కౌశలంతో అశేష ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగించారు. జయలలిత 1961 నుంచి 1980 వరకు దక్షిణ సినీరంగాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలారు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రలో ఒదిగిపోయే లక్షణం జయలలిత సొంతం. ఇచ్చిన పాత్రలో ఆమె జీవిస్తుంది. నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, అల్లరిపెట్టిస్తుంది. ఇలా అనేక పాత్రల్లో నటించి లక్షలమంది ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది జయ.

15వ ఏట..
జయలలిత తన 15వ ఏటనే సినీ రంగంలోకి ప్రవేశించారు. 1961లోనే బాలనటిగా తెరంగేట్రం చేశారు. కన్నడ భాషలో శ్రీశైల మహాత్యంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి 1980 వరకు దాదాపు 140కిపైగా చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి అభిమానులను మెప్పించారు. నటన, డ్యాన్స్‌లతో ప్రేక్షకులను మైమరపింప జేసిన జయలలిత దక్షిణాది సినీరంగంలో క్వీన్‌గా నిలిచారు. కథక్‌, భరతనాట్యం, మోహినీఅట్టం, మణిపురివంటి నాట్యాలలో జయలలిత ప్రావీణ్యురాలు. సినిమాల్లోకి రాకముందే వీటిలో ఆమె ప్రావీణ్యం సంపాదించారు. దేశ విదేశాల్లో ఆమె స్టేజీ షోలు చేశారు. బాల్యంలోనే అతిరథ మహారథులతో ప్రశంసలు అందుకున్నారు. అలా వచ్చిన పరిచయాలతోనే బాల్యనటిగా సినీరంగంలోకి ప్రవేశించారు. తమిళ, తెలుగు, కన్నడ, మళయాళీ చిత్రాలతోపాటు హిందీభాషా చిత్రంలోనూ నటించి మెప్పించారు.

తెలుగు ప్రేక్షకులతో..
ప్రతిభ ఉన్న వారిని జయలలిత వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఎంతో మందికి సినిమా రంగంలో అవకాశాలు కల్పించారు. ఆమె ప్రోత్సహించిన వారు సినిమా రంగంలో ఎంతోమంది ఉన్నత స్థానానికి ఎదిగారు. నేటీకీ కొంతమంది సినిమా రంగంలో కొనసాగుతున్న వారూ ఉన్నారు. నటనతోపాటు జయలలిత సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మనసున్న మహారాణిగా వెలుగొందారు. తెలుగు ప్రేక్షకులతో జయలలితకున్న అనుబంధం విడదీయరానిది. తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆమె మంత్రముగ్దుల్ని చేసింది. అగ్ర శ్రేణిహీరోల సరసన నటించి మెప్పించింది. ఆమెతో నటించేందుకు హీరోలు పోటీపడేవారంటే అతిశయోక్తి కాదు. జయలలిత మనుషులు మమతలు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. తెలుగులో దాదాపు 30 సినిమాలకుపైగా నటించారు. తెలుగులో అగ్రహీరోలందరితోనూ నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. నందమూరి తారక రామారావుతో జయలలిత అనేక సినిమాల్లో కలిసి చేశారు. బాగ్దాద్‌ గజదొంగ, దేవుడు చేసిన మనుషులు, కథానాయకుడు, తిక్క శంకరయ్య, శ్రీకృష్ణవిజయం, గండికోట రహస్యంలాంటి సినిమాల్లో ఆమె చూపిన నటన ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది.

పోటీ పడి నటించిన జయ..
అక్కినేని నాగేశ్వరరావుతోనూ జయలలిత పోటీపడి నటించారు. ఏఎన్‌ఆర్‌తో చేసిన మనుషులు మమతలు చిత్రం ద్వారానే జయలలిత తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మొదటి చిత్రంలోనే జయ అత్యద్భుతంగా నటించి అందరినీ మెప్పించారు. నవరాత్రి, ఆదర్శకుటుంబం, బ్రహ్మచారి చిత్రాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు అభిమానులైపోయారు. ఇక శోభన్‌బాబుతో చేసిన సినిమాలు తక్కువే అయిన తెరపై ఈ జంటకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. డాక్టర్‌బాబు, గూడఛారి 116లో ఇద్దరూ పోటీ పడి నటించారు. 1967లో వచ్చిన చిక్కడు దొరకడు, గోపాలుడు భూపాలుడులోనూ జయలలిత అద్భుతంగా నటించారు. నవరాత్రి సినిమాలో మానసిక పాత్రలో జయలలిత ఒదిగిపోయిన తీరు విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. జయలలిత నటనా పటిమకు అగ్రహీరోలు సైతం ఆశ్చర్యపోయేవారంటే అతిశయోక్తి కాదు. ఒకానొకదశలో అగ్రశ్రేణి హీరోలు సైతం జయతో నటించేందుకు పోటీపడేవారంటే ఆమె జీవితం ఎంతగా వన్నెలీనిందో అర్ధం చేసుకోవచ్చు. జయకున్న ప్రాముఖ్యత ఏ పాటిదో గ్రహించవచ్చు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో జయలలిత చిరస్థాయిగా నిలిచిపోయారు.

తమిళ చిత్ర సీమలో..
జయలలిత తమిళ చిత్రసీమలో మకుటం లేని మహారాణిగా వెలిగిపోయారు. విభిన్నపాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకులను మైమరపించారు. ఎంజీఆర్‌తో కలిసి ఆమె చేసిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. తమిళ చిత్రసీమలో అగ్ర హీరోలందరి సరసన నటించి మెప్పించారు. తమిళ సినీ రంగాన్ని ఏలిన క్వీన్‌గా జయను చెప్పుకుంటారు. 1965లో శ్రీధర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన వెన్నిరాడై చిత్రంతో తమిళ సినిమా రంగంలో జయ అడుగుపెట్టారు. తొలి సినిమాతోనే ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పురచ్చి తలైవర్‌, ఎంజీఆర్‌ సరసన తొలిసారిగా అయిరత్తిల్‌ ఒరువన్‌ సినిమాలో నటించారు. ఇలా తమిళంలో మొత్తం 80పైగా సినిమాల్లో నటించారు. అగ్ర హీరోలందరితో నటించి దశాబ్దల పాటు తిరుగు లేని తారలా రాణించారు.

ఎంజీఆర్ తో..
జయలలిత తన సినీ ప్రస్థానంలో ఎంజీఆర్‌తో కలిసి అనేక చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్‌ వంటి అగ్రనాయకుడికి అప్పట్లో జోడీ ఎవరంటే.. జయలలిత పేరే ప్రధానంగా వినిపించేది. వీరి జోడీ అంతలా ప్రేక్షకాదరణ పొందింది. వీరిద్దరి కాంబినేషన్‌లో 28 సినిమాలు వచ్చాయి. ఇందులో ఒకటి అర తప్పా అన్ని హిట్‌లే. ఎంజీఆర్‌తో చేసిన సినిమాలు ఎన్నో బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించాయి. అరసకట్టాలి, పుదియభూమి, ముహరాసి, నీరుమ్‌ నిరుప్పుమ్‌, ఓలి విలక్కు, ఎంగల్‌ తంగమ్‌, కుమారి కొట్టమ్‌లాంటి సినిమాలు జయలలిత కెరీర్‌ను మలుపు తిప్పాయి. ఎంజీఆర్‌కు వెండితెరపై పూర్తిస్థాయిలో జోడీ కుదిరే నాయికగా జయకు గుర్తింపు లభించింది. ఇక శివాజీగణేషన్‌తోనూ అధిక సినిమాల్లో జయలలిత నటించారు. సాంఘిక, భక్తిరస చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు. 1966లో యార్ని అనే తమిళ సినిమాలో జయ మొదటిసారి ద్విపాత్రాభినయం చేశారు. సంధ్యా, మోహిని అనే రెండు పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత వచ్చిన నీ కందన్‌ కరుణై చిత్రాల్లోనూ... జయలలిత డబుల్‌ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. అడిమైపెన్‌ అనే తమిళ చిత్రంలో ద్విపాత్రాభినయంతో అలరించిన జయ.. ఆ చిత్రంలో ప్రదర్శించిన నటకు ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. తంగాగోపురం అనే తమిళ సినిమాలో నటనకు గాను జయ తమిళనాడు సినిమా ఫాన్‌ అవార్డును కైవసం చేసుకున్నారు.

పురస్కారాలు..
జయలలిత నటనతోనే కాదు తన గాత్రంతోనూ ఎంతోమంది ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. వినసొంపైన గాత్రంతో ఎన్నో తమిళ చిత్రాల్లో పాటలు పాడి అలరించారు. పదికిపైగా సినిమాలు 5కుపైగా ఆల్బమ్స్‌లో పాటలుపాడి అలరించారు. అడిమైపెన్‌, సూర్యకాంతి, తిరుమాంగళ్యం లాంటి చిత్రాల్లో ప్లేబాక్‌ సింగర్‌గా జయ తన ప్రతిభను చూపారు. జయలలిత నటనకు ఎన్నో అవార్డులు, రివార్డులు ఆమెను వెదుక్కుంటూ వచ్చాయి. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు నటనకు రెండు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సొంతమయ్యాయి. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయను కళైమామణి పురస్కారముతో సత్కరించింది. వీటితోపాటు అనేక అవార్డులు ఆమెకు లభించాయి.

Don't Miss