ఐడీఎస్ అట్టర్ ఫ్లాప్ షో !..

19:19 - December 7, 2016

ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం డొల్లేనా..? స్వచ్ఛందంగా బ్లాక్‌మనీని ప్రకటించేందుకు ఉద్దేశించిన ఐడీఎస్‌ తుస్సుమన్నట్లేనా..? 65వేల కోట్ల నల్లధనం వెలుగులోకి వచ్చిందన్న ప్రభుత్వ ప్రకటనలోనే వాస్తవమెంత..? అసలు ఈ పథకం ప్రవేశపెట్టి.. కేంద్రం ఏం ఉద్ధరించినట్లు..! ఏం లబ్దిపొందినట్లు..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు మేధావులు, ఆర్థిక నిపుణుల మెదళ్లను తొలుస్తున్న మిలియన్‌ డాలర్ల ప్రశ్నలు..! ఐదు వందలు, వెయ్యి నోట్ల రద్దు తర్వాత దేశమంతటా బ్లాక్‌మనీ గుట్టలు గుట్టలుగా బయటపడుతోందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఆదాయ స్వచ్ఛంద వెల్లడిలో పది కాదు ఇరవై కాదు.. ఏకంగా 65వేల కోట్ల రూపాయలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఏలికల ప్రకటనలు సగటు భారతీయుడిలో భవిష్యత్‌పై కోటి ఆశలు చిగురింప చేశారు. కానీ ఇటీవల బయటపడుతున్న కొన్ని వాస్తవాలు ఈ స్కీం డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి.

బాంబు పేల్చిన మహేశ్‌ షా..
ఆమధ్యలో అహ్మదాబాద్‌కు చెందిన మహేశ్‌ షా.. 13వేల కోట్ల సంపద తనవద్ద ఉందంటూ ఐడీఎస్‌ కింద వెల్లడించాడు. దీనికి సంబంధించిన ట్యాక్స్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాల్‌మెంట్‌ కట్టకుండా ముఖం చాటేశాడు. తీరా ఇప్పుడేమో.. అది తన సొత్తే కాదని, కొందరు పెద్దలకు చెందినదని బాంబు పేల్చేశాడు. వాస్తవానికి ఆయన జీవన శైలిని చూసినవారు కూడా మహేశ్‌ షాకు అంతసీన్‌లేదనే అంటున్నారు. ఇక ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి బాణాపురం లక్ష్మణరావు వంతొచ్చింది. ఆయన కూడా తన వద్ద అక్రమంగా పోగేసుకున్న పదివేల కోట్ల రూపాయలు ఉన్నాయంటూ ఐడీఎస్‌ కింద ప్రకటించారు. అప్పట్లో ఈ అంశం రాజకీయంగానూ పెద్ద కలకలాన్నే రేపింది. ఈ మొత్తాన్ని ప్రకటించిన వ్యక్తి చంద్రబాబు బినామీ అని వైఎస్సార్సీపీ ఆరోపిస్తే.. జగనే ఆ మొత్తాన్ని ఐడీఎస్‌ కింద వ్యక్తీకరించాడని టీడీపీ ఆరోపించింది. తీరా ఆమొత్తానికి ట్యాక్స్‌ కట్టాల్సిన గడువు పూర్తయ్యే సరికి అసలు విషయం వెల్లడైంది. మొదటి విడత పన్ను మొత్తం 1125 కోట్లు చెల్లించకుండా లక్ష్మణరావు ముఖం చాటేయడంతో ఐటీ శాఖ ఆయన గుట్టును రట్టు చేసింది. లక్ష్మణరావు బిజినెస్‌ టర్నోవర్‌ 5 నుంచి 10 కోట్ల లోపే ఉంటుందని అంచనా వేశారు.

ఐడీఎస్‌ కింద వెల్లడైన మొత్తం రూ. 42 వేల కోట్లు..
ఐడీఎస్‌ కింద వెల్లడించిన నల్లధనం మొత్తంపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముంబైకి చెందిన మహేశ్‌షా, హైదరాబాద్‌కు చెందిన లక్ష్మణరావు ప్రకటించిన మొత్తం 23వేల కోట్ల రూపాయల నల్లధనం బోగస్‌ అని తేలింది. అంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకున్న 65వేల కోట్ల నల్లధనంలో సుమారు 40 శాతం బోగస్‌ అని స్పష్టమవుతోంది. ఐడీఎస్‌ పథకం కింద భారీ మొత్తాలను వెల్లడించిన వారంతా చేతులు ఎత్తేస్తుండడంతో ఈ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మొత్తంలోంచి మహేశ్‌షా, లక్ష్మణరావులు ప్రకటించిన 23వేల కోట్ల మొత్తాన్ని తీసివేస్తే నికరంగా ఐడీఎస్‌ కింద వెల్లడైన మొత్తం 42 వేల కోట్లుగా తేలుతుంది. ఇందులోనూ ఎంత మొత్తానికి పన్ను వసూలైందన్న పరిశీలిస్తే గానీ, ఐడీఎస్‌ ఏ మేరకు సక్సెస్‌ అయిందో తేటతెల్లం కాదు.

ఐడీఎస్‌ కింద వెల్లడైన నల్లధనంపై సందేహాలు..
నల్లధనాన్ని రూపుమాపుతున్నామంటూ బీజేపీ అగ్రనాయకత్వం చేస్తున్న ప్రకటనల్లో డొల్లతనమే బట్టబయలవుతోంది. ఐడీఎస్‌ తరహాలోనే పెద్ద నోట్ల రద్దు అంశంలోనూ ప్రభుత్వం మాట మార్చుతున్నట్లు స్పష్టమవుతోంది. నల్లధనం మొత్తాన్ని బయటకు తెచ్చేందుకే పెద్దనోట్ల రద్దు అంటూ ప్రధాని మోదీ ప్రకటిస్తే.. నెల తర్వాత ఇప్పుడు జైట్లీయేమో.. నగదు రహిత కార్యకలాపాలు, బ్యాంకింగ్‌ వ్యవస్థలు అద్భుతంగా పనిచేస్తున్నాయంటూ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ప్రకటనల్లో నల్లధనం పక్కకు వెళ్తుండడాన్ని బట్టి చూస్తే.. ఈ అంశంపై వాస్తవాలు... నేతల ప్రకటనల మధ్య అంతులేని అంతరం ఉందన్నది తేటతెల్లమవుతోంది. మొత్తానికి ఐడీఎస్‌ పథకం పసలేనిదిగా.. అట్టర్‌ ఫ్లాప్‌ షోగా మిగిలిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 

Don't Miss