'అమ్మ' వారసుడెవరు?

20:42 - December 7, 2016

అమ్మ వారసత్వం ఎవరిది? అన్నాడీఎంకే సారధి ఎవరు? తాత్కాలికంగా ఈ అంశం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా...పరిస్థితి నివురుగప్పినట్టుగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార కేంద్రాలు వేటికవే యాక్టివ్ గానే ఉన్నాయి. మరి రాబోయే కాలంలో ఎవరిది పైచేయి కాబోతోంది? ఎవరి చేతికి అన్నా డీఎంకె పగ్గాలు వెళ్లబోతున్నాయి. ఈ అంశంపై ప్రత్యేక కథనం.. శశికళ, పన్నీర్ సెల్వం, అజిత్ ఇప్పటికి అన్నాడీఎంకెలో వినిపిస్తున్న పేర్లు.. ఈ ముగ్గురిలో ఎవరు నిలబడతారు? ఎవరు పై చేయి సాధిస్తారు. జయ నెచ్చెలి శశికళ, నమ్మినబంటు పన్నీర్ సెల్వం, పాపులారిటీలో ముందున్న అజిత్ వీరిలో అమ్మ వారసుడెవరు?  మూడు అధికార కేంద్రాలు..ఓ పక్క అమ్మ పోయస్ గార్డెన్ నుండి జైలుకి.. అపోలో ఆస్పత్రికి వెళ్తున్న సందర్భం..వ్యక్తిగత సమస్యల్లో మునిగినప్పుడు ఇలా పలు సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులు సన్నిహితులయ్యారు. వేర్వేరు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. అంతిమంగా వీటిలో ఏది నిలబడనుంది ? ఇదే ఇక్కడ ప్రశ్న.. !!

మారిపోతున్న పరిణామాలు..
ఓ పక్క జయ అంత్యక్రియలు కాలేదు.. ఆ లోపే కొత్త క్యాబినెట్ కొలువుతీరింది. పన్నీర్ సెల్వం సీఎం పీఠంపై కూర్చుకున్నారు. పన్నీర్ అన్నా డీఎంకేను ఇకముందు కూడా నడిపించబోతున్నారా? లేక మరో కొత్త నేత వచ్చేవరకు మాత్రమే పన్నీర్ ఆ బాధ్యతలు తీసుకుంటారా? కొన్నేళ్ల క్రితం వరకు సామాన్య వ్యక్తిగా ఉన్న పన్నీర్ అమ్మకు ఎలా దగ్గరయ్యారు? సీఎం పీఠంపై ఎలా కూర్చున్నారు. అధికార అన్నాడీఎంకెలో రాజకీయ పరిణామాలు తెరవెనుక వేగంగా మారిపోతున్నాయి. జయలలిత తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన నేతపై ఫోకస్ పెట్టింది ఆ పార్టీ. తెరవెనుక చాలామంది పేర్లు వెలుగులోకి వచ్చినా, డీఎంకెని బలంగా ఢీకొట్టే నేతలెవరు? రాజకీయపరంగా జయలలిత వారసుడిగా పన్నీరుసెల్వం ఓకే అయినా, ప్రజల్లో అంత అభిమాన నటుడు అజిత్ కావచ్చుననే వార్త తమిళనాట జోరుగా ప్రచారం సాగుతోంది.

ఆసక్తికరం..
దక్షిణాది రాజకీయాలు జనాకర్షక నేతల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తమిళనాట అలాంటి శూన్యం ఒకటి ఏర్పడింది. దానికి పరిష్కారం ఏమిటి అనేది ఇప్పటికి సమాధానం లేని ప్రశ్నే. తన సుస్థిరత కోసం పార్టీల్లో నంబర్ టూలు లేకుండా చేసుకునే నేతలు దక్షిణాది ప్రాంతీయ పార్టీల్లో ఉన్నారు. ఇప్పుడు అలాంటి ఓ నేత నిష్క్రమణం తర్వాత ఏర్పడిన ఖాళీ ఎలా భర్తీ అవుతుందనే అనే అంశం ఆసక్తికరంగా మారింది. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss