గడిచిపోయే కాలనికి మిగిలిపోయే జ్ఞానపకాలు

20:43 - December 25, 2017

కాలచక్రం గిర్రున తిరిగింది. కేలండర్ లో చివరి పేజీల్లో ఉన్నాం. సంవత్సరకాలంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణామాలు, ప్రమాదాలు, ప్రమోదాలు... కుట్రలతో ప్రపంచాన్ని మభ్య పెట్టి, నిఘాలతో తన ప్రయోజనాలు కాపాడుకునే దౌర్భాగ్యం ఒకరిది. కాళ్లకింద నేలను నిలబెట్టుకోవాలనే ఆరాటం మరోపక్క.., ఎగసిన నినాదాలు.., బిగిసిన పిడికిళ్లు, రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు.., ప్రకృతి శాపానికి, విలయ తాండవానికి బలైన వారు... ఇలా అనేక ఘటనలను దాటుకుని 2017 ముగింపుకొచ్చింది.. ఈ రోజు వైడాంగిల్ లో వాల్డ్ రౌండప్ ను చూద్దాం..అయిదు దేశాలు..భవిష్యత్ ప్రపంచ ముఖచిత్రాలు.. ఒక్కటైన స్నేహహస్తాలు.. చైనా వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశం ఇప్పుడు అభివృద్ధి, సహకారం లాంటి అంశాలనే కాదు... తీవ్రవాదంలాంటి అంశాలకూ వ్యతిరేకంగా గళమెత్తింది. ప్రపంచంలోని పలుదేశాల కూటములలో అత్యంత ప్రభావం చూపుతున్న కూటమిగా బ్రిక్స్ దేశాల కూటమి నిలబడింది ..

కాళ్లకింద భూమి కదిలిపోతోంది. తలపైన ఆకాశం నిప్పుల వర్షం కురిపిస్తోంది. సంద్రం వైపు ఆశగా చూసే కళ్లను తీరం తిరస్కరిస్తోంది. వెరసి ఎవరికీ చెందని అభాగ్యులయ్యారు. మాతృభూమికి, పరాయిదేశానికి మధ్య బతుకు ప్రశ్నార్ధకంగా మారుతోంది. భూమిపై గీతలు గీసుకున్న సరిహద్దులు, నిబంధనల పేరుతో నిరాకరించి అపహసిస్తున్న పౌరసత్వాలు.. అణచివేతకు పరాకాష్టగా మారిన పరిస్థితులు.. వెరసి రోహింగ్యాలు ఇప్పుడు లెక్కల్లో లేని మనుషులు.. దేశం లేని పౌరులు.. ఉనికి నిరాకరించబడిన దీనులు..ఆధునిక ప్రపంచంలో అణచివేతకు నిజమైన ఉదాహరణగా కనిపిస్తున్నారు రోహింగ్యాలు ..మారణాయుధాలనే నమ్ముకున్న అమెరికా చివరకు తన బిడ్డలను కూడా అవే మారణాయుధాలకు బలితీసుకుంటోంది. అమెరికాలో జరుగుతున్నన్ని తుపాకీ చావులు ప్రపంచంలో మరెక్కడా జరగడం లేదు. అమెరికాలో తుపాకీ కాల్పులు వినిపించని రోజంటూ కనిపించటం లేదు.. గత అక్టోబర్ లో జరిగిన లాస్ వెగాస్ ఘటన అమెరికా గన్ కల్చర్ ఫలితాల్ని స్పష్టం చేస్తోంది.

లేని దేశాన్ని సృష్టించారు..ఉన్నదేశాన్ని నాశనం చేశారు..ప్రజలను వెళ్లగొట్టారు.. లక్షలాది మంది ప్రాణాలు తీశారు..ఇప్పుడు ఆ దేశ రాజధానిపై కన్ను పడింది. దానిపై జెండా ఎగరేసే కుట్రలు చేస్తున్నారు. అమెరికా, దాని తొత్తు ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాగతాలు జెరూసలెం నగరాన్ని పాలస్తీనీయులకు కాకుండా చేసే దిశగా సాగుతున్నాయి. నోరు జారుతున్నారు. సై అంటే సై అంటున్నారు. తెరవెనుక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నీకంత సీన్ లేదంటే నీకంత సీన్ లేదంటున్నారు. నువ్వెంతంటే నువ్వెంతని సవాల్ విసురుతున్నారు..నార్త్ కొరియా మొండితనం, పెద్దన్న మూర్ఖత్వం 2017లో స్పష్టంగా కనిపించిన అంశం.. సరదాగా మొదలౌతుంది. రక్తం చిందటంతో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో నానా రకాల ఆటలాడిస్తుంది. అంతా గేమ్ లో భాగం అనుకుంటారు. కానీ, అది వాడి స్క్రీన్ ప్లేలో భాగమని గుర్తించలేరు. ఆడిస్తూ, పాడిస్తూ, బెదిరిస్తూ చివరకు చావుముంగిట్లోకి పిల్లలను లాక్కెళుతోందా గేమ్. అదే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్.. 2017లో పిల్లల గురించి భయపడేలా చేసింది ఈ గేమ్గ్లోబల్ టెర్రరిజమ్ ఇండెక్స్.. ప్రపంచాన్ని మేల్కొనమని చెప్తోంది. టెర్రరిజం ఎలాంటి విధ్వంసం కలిగిస్తోందో కళ్లకు కడుతోంది. లెక్కలతో సహా రుజువులు కళ్లముందుంచుతోంది. భారత్ తో పాటు అనేక దేశాలకు ఉగ్రవాద ముప్పు బలంగా ఉందనే అంశాన్ని స్పష్టం చేస్తోంది. మాంచెస్టర్ లో జరిగిన ఘటన ఉగ్రవాదం ఎలా పెరుగుతోందో చెప్తోంది. స్పెయిన్ వేర్పాటు వాదంతో రగిలిపోతోంది. కాటలోనియా స్పెయిన్ నుంచి విడిపోవాలని బలంగా చేస్తున్న ప్రయత్నాలతో ఆ దేశం అట్టుడికి పోతోంది. మరోపక్క రెఫరెండం విడిపోటానికి అనుకూలంగా రావటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా ఎన్నికల్లో కూడా విడిపోవాలనే వాదనకే మద్దతు లబించింది. ఇదీ వాల్డ్ రౌండప్.... ఇక మన దేశంలో ఏం జరిగింది? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగాయి.. ఎలాంటి పరిణామాలు దేశ గతిని మలుపుతిప్పుతున్నాయి... ? పూర్తి వివరాలకువ వీడియో క్లిక్ చేయండి.

Don't Miss