తిరుమలేశుని పవిత్రోత్సవాల పూజా విశేషాలేమిటి?..

20:54 - August 21, 2018

తిరుమల : తిరుమలేశుని ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రుత్వికులు.. ఈ ఉత్సవాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇంతకీ ఈ పవిత్రోత్సవాల ఉద్దేశం ఏంటి..? ఈ సందర్భంగా నిర్వహించే విశేష పూజాధికాలు ఏంటి..?

కలియుగ వరదుడు.. శ్రీనివాసుడి సాలకట్ల పవిత్రోత్సవాలు.. ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం శాస్త్రోక్త పవిత్ర ప్రతిష్ఠ అనంతరం.. శ్రీదేవీ..భూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామిని.. పవిత్ర మంటపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ హోమాది వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏడాది పొడవునా.. తిరుమలేశుని ఆలయంలో జరిగే అర్చనలు.. ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ.. సిబ్బంది వల్లగానీ.. తెలిసో, తెలియకో జరిగే దోష నివారణార్థం.. ఆలయ పవిత్రతను పరిరక్షించే ఉద్దేశంతో.. ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ..

తిరుమలేశుని పవిత్రోత్సవం... అత్యంత శుభదం..! అనాదిగా.. వస్తోన్న సంప్రదాయం. 15-16 శతాబ్దాల నుంచే ఈ వేడుక ఉన్నా... మధ్యలో ఆగిపోయి.. 1962లో పునఃప్రారంభమైమనట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

శ్రీవారికి వినియోగించే.. పవిత్రాల తయారీకి 20 మూరల పట్టుదారం లేదా 200 మూరల నూలు దారం వినియోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దకం చేస్తారు. పవిత్రాలు చేసేందుకు.. టీటీడీ శ్రేష్టమైన జాతి పత్తి మొక్కలను పెంచుతోంది.

ఆలయ మొదటి ప్రాకారంలో గ డడడల వగపడి వరండాలో ఉత్తరం వైపున రాతి గోడపై పవిత్రోత్సవాల లెక్కలకు సంబంధించిన పురాతన శాసనం లభ్యమైంది. అప్పట్లో ''పవిత్ర తిరునాళ్‌'' పేరిట నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ఉపయోగించిన వస్తువుల జాబితా, వాటి ధరలు ఈ శాసనంలో పొందుపరిచారు.

పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులూ.. ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు స్నపన తిరుమంజనం.. సాయంత్రం ఆరు నుంచి 8 గంటల వరకూ నాలుగు మాడవీధుల్లో ఉభయదేవేరులతో శ్రీవారి విహారం.. కొనసాగుతుంది. తొలిరోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండో రోజు పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు.

పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయి. పవిత్రోత్సవాల సందర్భంగా.. మూడు రోజుల పాటు అష్టదళ పాదపద్మారాధన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడసేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది. 

Don't Miss