రైతు బంధు ఓట్లు రాల్చే పథకమా ?

06:27 - May 8, 2018

హైదరాబాద్ : రైతు బంధు పథకంపై టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు రాల్చే పథకంగా పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే పథకం ఉద్దేశం మంచిదైనా... నిబంధనలతో సర్కారుకు కొత్త చిక్కులు తప్పవన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కౌలు రైతులను విస్మరించడం అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. రైతు బంధు పథకం అమలును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది. వచ్చే ఎన్నికలకు ఈ పథకం శ్రీరామరక్ష అవుతుందన్న భావన టీఆర్‌ఎస్‌ నేతల్లో ఉంది.

రైతు బంధు పథకం ద్వారా పార్టీకి అన్నదాతల మద్దతు కూడగట్టేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రైతుల సంక్షేమమే పరమావధిగా పెట్టుకుని పనిచేస్తోంది. గతంలో రైతులు ఎదుర్కొన్న ఎరువులు, విత్తనాలు, విద్యుత్ సమస్యలను తాము పరిష్కరించామన్న ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల్లో కూడా అన్నదాతలను తమ దారికి తెచ్చుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. రైతు బంధు పథకం అమలు ద్వారా అన్నదాతల అండ తమకే అన్న ధీమాతో టీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారు.

రైతు బంధు పథకం సమర్ధవంతంగా అమలు చేసే చర్యల్లో భాగంగానే భూ రికార్డులను ప్రక్షాళన చేసింది. అర్హులైన రైతులకు ప్రభుత్వం ఏటా రెండు సార్లు అందించేందుకు నిర్ణయించిన పెట్టుబడి సాయం పథకాన్ని ఈనెల 10 అమలు చేయనుంది. ఎకరానికి 8 వేల రూపాయల పెట్టుబడి సాయం చేస్తారు. ఖరీఫ్‌లో 4 వేల రూపాయలు, రబీలో మరో 4 వేల రూపాయలు అందిస్తారు ఎక్కువ మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

రైతు బంధు పథకం ద్వారా ఎలాంటి వివాదాలు లేని భూములకు మాత్రమే పెట్టుబడి సాయం చెక్కులు అందించాలని నిర్ణయించింది. కౌలు రైతులకు ఈ పథకం వర్తించదు. భూ యజమానికే సాయం అందిస్తారు. క్షేత్ర స్థాయిలో కైలు రైతులే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వీరి ఆగ్రహానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గురయ్యే అవకాశాలు లేకపోలేదన్న భయంతో పార్టీ నేతల్లో ఉంది. ఈ అంశం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సహాయం అందని రైతులు ఐక్యమైతే పరిస్థితి మరోలా ఉంటుందని భావిస్తున్నారు. రైతు సమన్వయ సమితులతో ఇప్పటికే రైతుల్లో వర్గవిభేదాలు తలెత్తగా.. కౌలు రైతుల సమస్యల ఇప్పుడు మరో కొత్త వివాదానికి దారితీసే అకాశంలేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయం చేసే రైతులందరికీ ఈ పథకాన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటే ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం నేతల్లో వ్యక్తం అవుతోంది. సర్కారు ఏం చేస్తుందో చూడాలి. 

Don't Miss