కథలాపూర్ లో 'రాజకీయ చీకటి' కథలు ..

21:42 - July 10, 2018

జగిత్యాల : తెలంగాణలో రాజకీయ చీకటి ఒప్పందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అధికారం కోసం.. అడ్డదారులు తొక్కిన నేతల గుట్టు రట్టవుతోంది. అవిశ్వాస తీర్మానాల నేపథ్యంలో.. కొత్త కొత్త వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. పదవి కోసం డబ్బులు చేతులు మారిన వైనం ఒకటి.. జగిత్యాల జిల్లాలో బయటపడింది. ఆ కథాకమామిషు ఏంటో ఓసారి చూద్దాం...
వెలుగుచూసిన నాలుగేళ్లనాటి చీకటి ఒప్పందం
జగిత్యాల జిల్లాలో నాలుగేళ్ల నాటి చీకటి ఒప్పందం ఒకటి బయటపడింది. అధికారం పొందడమే పరమావధిగా సాగిన డబ్బుల పందేరం వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల క్రితం.. కథలాపూర్‌ ఎంపీపీ పదవి కోసం.. తోటనర్సు.. ఎంపీటీసీకి నాలుగు లక్షల రూపాయలు చెల్లించారు. దీనికి సంబంధించి ఓ అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నారు. ఎంపీపీ తోటనర్సుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో.. నాలుగేళ్లనాటి చీకటి ఒప్పందం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన బాండ్‌ పేపర్‌ ఇప్పుడు జిల్లాలో హల్‌చల్‌ చేస్తోంది.

ఎంపీటీసీలకు భారీగా నగదు పంపిణీ..
జగిత్యాల జిల్లా కథలాపూర్‌లోని 13 ఎంపీటీసీ స్థానాలకు గాను.. బీజేపీ, టీఆర్ఎస్‌లు చెరి ఐదు స్థానాలు గెలిచాయి. కాంగ్రెస్‌ మూడింట గెలిచింది. దీంతో కాంగ్రెస్‌కు చెందిన పోతారం ఎంపీటీసీ తోట నర్సు.. బీజేపీ మద్దతును కోరారు. ప్రతిగా.. వారికి భారీ మొత్తాన్ని ముట్టజెప్పారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన దులూరు ఎంపీటీసీ సౌజన్య భర్త గంగాధర్‌.. తోటనర్సుకు మద్దతిచ్చేందుకు నాలుగు లక్షలు తీసుకున్నారు. ఒకవేళ మధ్యలో మద్దతు విరమిస్తే.. 20 లక్షల రూపాయలు చెల్లిస్తానంటూ బాండ్ పేపర్‌ మీద రాసి మరీ సంతకం పెట్టారు. 2014 మే 14వ తేదీన ఈ ఒప్పందంపై సంతకాలు పెట్టారు

చర్చనీయాంశంగా మారిన అవిశ్వాస తీర్మానం
వివిధ కారణాల వల్ల.. బీజేపీ, టీఆర్ఎస్‌ ఎంపీటీసీలు.. ఎంపీపీ తోట నర్సుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో తోట నర్సు వర్గం.. ఎంపీటీసీ కుందారపు సౌజన్య భర్తను బహిరంగంగా.. గ్రామం మధ్యలోనే నిలదీయడం చర్చనీయాంశమైంది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు.. తమకు 20 లక్షలు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. దీనికి గంగాధర్‌ రెండు రోజులు గడువు కోరారు. ఎంపీపీ పదవి కోసం.. లక్షల రూపాయలు చేతులు మారడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం జగిత్యాల జిల్లా చర్చనీయాంశంగా మారింది.

Don't Miss