ఓ పక్క వరద,మరోపక్క కరవంటు బాబు ఆవేదన..

21:39 - August 22, 2018

అమరావతి : భారీ వర్షాలు, వరదలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. హెక్టారుకు పాతికవేల రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ప్రత్యామ్నాయ పైర్ల సాగుకు సహాయం చేస్తామని తూర్పుగోదావరి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు.

తూ.గో. జిల్లా వరద ముంపు ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే
ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎరియల్‌ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన పంటలను పరిశీలించారు. గ్రామాల్లో నిలిచివున్న వరదనీటిని చూసి చలించిపోయారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను అన్ని విధాల ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.

తూ.గో.జిల్లాలో 6,600 హెక్టార్లలో పంటనష్టం
తూర్పుగోదావరి జిల్లా 19 మండల్లాలోని 45 గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరార్శించిన చంద్రబాబు.. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాజమండ్రి విమానాశ్రయంలో వరద నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం 6,600 హెక్టార్లలో పంటనష్టం జరిగినట్టు నివేదించారు. పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు పాతికవేల రూపాయల పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. ఉభయగోదావరి జిల్లాల్లో 600 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్టు అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఎర్రకాల్వ పొంగిపొర్లడంతో ఎక్కువ నష్టం జరిగినట్టు తేల్చారు. ఎర్రకాల్వ ముంపు సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఆర్‌ అండ్‌ బీ రోడ్ల మరమ్మతులకు 35 కోట్ల రూపాయాలు కేటాయిస్తున్నట్టు చెప్పారు.

ఇంతవరకు 1500 టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలు
కోస్తా జిల్లాలు వరదలతో తల్లడిల్లుతుంటే.. రాయసీమ నాలుగు జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరవు ఉన్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఈ సీజన్‌లో ఇంతవరకు 1500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంపాలు కావడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో పోలవరం పనులకు ఆటంకం ఏర్పడిన విషయాన్ని గుర్తు చేసిన చంద్రబాబు.. వచ్చే ఏడాది మే నాటికి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇంతవరకు 57.5 శాతం పనులు పూర్తైన విషయాన్ని ప్రస్తావించారు. పోలవరం కోసం చేసిన ఖర్చులో కేంద్రం నుంచి ఇంకా 2,600 కోట్ల రూపాయల రావాల్సి ఉందన్నారు. నిర్మాణ బాధ్యతలను పూర్తిగా కేంద్రం తీసుకున్నా అభ్యంతరంలేదని చంద్రబాబు చెప్పారు.

ప్రాజెక్టు నిర్మానానికి ప్రతిపక్షాలు అవరోధాలు : చంద్రబాబు
మరోవైపు ప్రాజెక్టు నిర్మానానికి ప్రతిపక్షాలు అవరోధాలు సృష్టిస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో 57 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టామని, 16 పూర్తయ్యాయని చంద్రబాబు వివరించారు. ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు విపక్షాలకులేదని మండిపడ్డారు.వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే, పంటనష్టంపై సమీక్ష నిర్వహించిన తర్వాత చంద్రబాబు రాజమండ్రి నుంచి అమరావతి బయలుదేరి వెళ్లారు. 

Don't Miss