నత్తనడకన దుర్గగుడి ఫ్లై ఓవర్..

15:09 - December 3, 2016

విజయవాడ : బెజవాడ పేరుకే పెద్ద నగరం. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణం చేస్తుంటాయి. చూడడానికి చక్కని రోడ్లున్నా.. ట్రాఫిక్‌ను నియంత్రించలేని పరిస్థితి. ఎప్పుడు చూసినా.. ట్రాఫిక్‌ పద్మవ్యూహమే. దుర్గగుడి ఫ్లై ఓవర్‌ నిర్మాణం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. సర్కార్ విధిస్తున్న డెడ్‌లైన్లు చూసి సంబరపడుతున్నా.. పనుల్లో పురోగతి చూసి ఉసురుమంటున్నారు.

విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌ పనుల్లో అంతులేని జాప్యం
విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్‌ పనులు ఈనెలాఖరుకు పూర్తవుతాయా? సీఎం చంద్రబాబు సహా స్థానిక ప్రజా ప్రతినిధులు చెబుతున్నట్లు మరో 30 రోజుల్లో పనులు పూర్తవుతాయా? అంటే పనులు జరుగుతున్న తీరు ఇందుకు విభిన్నంగా కనిపిస్తోంది. ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా పనులు సాగుతున్నాయి. డిసెంబర్ నాటికి పనులన్నీ ముగించి, 2017 ఫిబ్రవరిలో ఫ్లైఓవర్‌ను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

డిసెంబర్‌ చివరినాటికి పనులు పూర్తి చేసి.. పూర్తి కాని పిల్లర్ల పనులు
అయితే దుర్గగుడి పనుల్లో జాప్యం కారణంగా వాహనదారులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. పనులు ఎప్పటిలోగా పూర్తిచేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2.5 కిలోమీటర్ల పొడవుతో ఆరు వరుసల్లో దుర్గగుడి ప్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 23 పిల్లర్లు పూర్తయ్యాయి. మిగతా పిల్లర్ల పనులు నత్తనడకన జరుగుతున్నాయి. భవానీపురం నుంచి కుమ్మరిపాలెం, దుర్గగుడి మీదుగా రాజీవ్ గాంధీ పార్క్ వరకు 2.5 కిలోమీటర్ల ప్లై ఓవర్, దాని కిందనే సమాంతరంగా ఐదు కిలోమీటర్ల పొడవైన రహదారిని నాలుగు వరుసల్లో కృష్ణలంక బ్రిడ్జ్ వరకు చేపడుతున్నారు. 2.5 కిలోమీటర్ల దూరాన్ని ఐదు భాగాలుగా చేసి పనులు సాగించారు. నిర్మాణపనులను సోమా సంస్థ చేపట్టింది.

2017 ఫిబ్రవరిలో ఫ్లైఓవర్‌ ప్రారంభించాలని సర్కార్‌ డెడ్‌లైన్‌
ప్రస్తుతం 28 పిల్లర్లు నిర్మాణం పూర్తి కాగా.. కాలువల్లో పిల్లర్ల పనులు 2017 మార్చినాటికి పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. 2.5 కిలోమీటర్ల దూరం ఆరు వరసలుగా ఉన్న ఈ వంతెన పూర్తయితే విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుముఖం పట్టనుంది. పనుల వల్ల.. హైదరాబాద్, భద్రాచలం వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్‌ కష్టాలు తప్పడం లేదు. నగరంలో సుమారు గంటకుపైగా ప్రయాణం చేయాల్సి వస్తోంది. మిల్క్ ప్రాజెక్ట్ నుంచి చిట్టినగర్ మీదుగా బస్టాండ్ చేరుకోవాల్సి వస్తోంది. రద్దీ సమయాల్లో విద్యార్థులు, ఉద్యోగుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. నగర పరిధిలో 4 కిలోమీటర్లు దూరానికి.. 14 కిలోమీటర్లు పైగా చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన దుర్గగుడి ఫై ఓవర్‌ పనులు పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు. 

Don't Miss