వెలుగులు పంచుతారు..వీరిలో వెలుగేది..

17:53 - December 7, 2016

కరీంనగర్ :  దేశానికి వెలుగులు పంచుతున్న బొగ్గు గని కార్మికుల శ్రమకు తగిన ఫలితం దక్కడం లేదు. ప్రాణాలను అర చేతిలో పెట్టుకోని ఇంధన ఆధారిత కంపెనీలకు బొగ్గును అందిస్తూ పారిశ్రామిక రంగ అభివృద్దికి కారణం అవుతున్న వారికి వేతనాలు మాత్రం ఆశించిన స్థాయిలో అందడం లేదు. వేతన సవరణ జరగక పోవడం కార్మికుల పాలిట శాపంగా మారుతోంది. సింగరేణి బొగ్గు గని కార్మికులకు సరైన వేతన ఒప్పందం జరగక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతన ఒప్పందాలు జరిగినప్పటికీ అవి కార్మికులకు అనుకూలంగా లేక పోవడం కార్మికులను నిరుత్సాహానికి గురి చేస్తున్నాయి.

56వేల మంది విధులు..
తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో 56 వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. గడిచిన ఐదేళ్లలో మార్కెట్ ధరలు 100 శాతం పెరిగినా కార్మికులకు చెల్లించే వేతనాలు 25 శాతానికే పరిమితం అయ్యాయి. ప్రస్తుతం జైపూర్ లో 10వ వేతన ఒప్పందం పై సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో వేతన సవరణ, గ్రాట్యుటీ పై చర్చించనున్నారు. ఈసారైనా ఆశించిన స్థాయిలో పెరుగుతాయా లేదా అనే బొగ్గు గని కార్మికులు చర్చించుకుంటున్నారు.

పలు ఒప్పందాలు..
కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ దేశంలోని నిత్యావసర ధరలను పరిగణనలోకి తీసుకొని ధరల సూచీని ప్రకటించడం జరుగుతుంది. ఈ ధరల సూచి ఆధారంగా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నియమించిన కోల్ ఇండియా లిమిటెడ్ కార్యదర్శి, ఆయా బోగ్గు కంపెనీల ప్రతినిధులు, జాతీయ కార్మిక సంఘాల వేజ్ బోర్డు సభ్యులతో కూడిన జెబిసిసిఐ సమావేశంలో చర్చించి బొగ్గు గని కార్మికుల వేతనాలు, అలవెన్సుల పై ఒప్పందం చేసుకుంటారు. ఈ ఒప్పందం ప్రకారం ఆయ బొగ్గు గనుల సంస్థల కార్మికులకు వేతనాలు
చెల్లిస్తారు.

1975లో తొల వేజ్ బోర్డు ఒప్పందం..
బొగ్గు గని కార్మికుల కోసం ప్రత్యేకంగా 1975 నవంబర్ 1 న తొలి వేజ్ బోర్డు ఒప్పందం ప్రారంభమైంది. ఆ తర్వాత 2016 జూన్ 30 వరకు తొమ్మిదవ వేజ్ బోర్డుల ద్వారా వేతన ఒప్పందాలు కుదిరాయి. మొదటి వేతన ఒప్పందంలో 1975 జనవరి 1 నుంచి 1979 డిసెంబర్ 31 నాటికి కార్మికుల కనీస వేతనం 443 రూపాయలు ఉండగా 9వ వేజ్ బోర్డు 2011 జులై 1 నాటికి అంటే 36 సంవత్సరాల్లో 17,565.86 రూపాయలకే పరిమితం అయింది. 36 యేళ్ల కిందట ఉన్న వస్తువుల ధరలు భారీగా పెరిగినా.. కార్మికుల వేతనాలు మాత్రం సరాసరి 20 నుంచి 25 శాతానికే పరిమితం అయ్యాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల వేతనాలతో పోల్చుకుంటే బొగ్గు గని కార్మికుల వేతనాలు మెరుగ్గా ఉన్నాయని కోల్ ఇండియా యాజమాన్యం అంటుండగా మార్కెట్ ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగటం లేదని కార్మికులు అంటున్నారు.

వేతనాలు పెంచుతారా ? 
వేతనాలను లెక్క కట్టడంలో శాస్త్రీయత పాటించడం లేదని కార్మికులంటున్నారు. కుటుంబ సభ్యులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని వేతనాలు లెక్కకడుతున్నారని.. తమపై ఆధారపడే తల్లిదండ్రులు, సోదరులు, చెల్లెళ్లను పట్టించుకోవడం లేదని కార్మికులంటున్నారు. దీంతో అనుకున్న స్థాయిలో వేతనాలు పెరగడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్మిక సంక్షేమమే ధ్యేమమంటూ చెప్పుకుంటున్న సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వ 10 వేతన ఒప్పందం ప్రకారం కార్మికులకు జీతాలు అనుకున్నస్ధాయిలో పెంచుతుందో లేదో చూడాలి.

Don't Miss