ఈస్ట్‌ లండన్‌లో ఘనంగా సంక్రాంతి వేడుకలు

07:49 - January 15, 2018

లండన్ : ఈస్ట్‌ లండన్‌లో తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. యునైటెడ్‌ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఈ సంబరాల్లో తెలుగు భాష, అలవాట్లు, అభిరుచులకు పెద్దపీట వేశారు.  తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆహూతులు తమ అభిలాషను వ్యక్తం చేశారు.
సాంస్కృతిక కార్యక్రమాలు 
యునైటెడ్‌ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ యుక్తా ఆధ్వర్యంలో జనవరి 13న 8వ సంక్రాంతి సంబరాలను ఈస్ట్‌ లండన్‌లో  ఘనంగా నిర్వహించారు. సంబరాల్లో మహిళలకు ముగ్గులపోటీలు, చిన్నపిల్లలకు ఫ్యాన్సీ డ్రస్‌ పోటీలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆయురారోగ్యాలు అందించేందుకే పిల్లలకు భోగిపళ్ళు పోస్తారని పద్మకిల్లి అన్నారు. తెలుగు వారికి ఎన్నో పండగలున్నా... దేనిప్రత్యేకత దానిదే అన్నారు ట్రస్టీ గీత మోర్ల. 
పెద్ద వేడుక
తెలుగు పండగరోజు తెలుగు వారంతా పరాయిదేశంలో ఒక చోట కలుసుకోవడమే పెద్ద వేడుక. ఇక్కడ బాలల కార్యక్రమాలను చూస్తే... ఎంతో ముచ్చటగా ఉందన్నారు యుక్తా అధ్యక్షులు మంత్రాల ప్రసాద్. బ్రిటన్‌లో ఉన్నా మాతృ భాషను మరవకుండా...   వారసత్వంగా  తమ పిల్లలకు అందిస్తున్న తల్లిదండ్రులను ఆయన అభినందించారు. సుమారు ఐదు గంటలపాటు సాగిన ఈ సంక్రాంతి వేడుకల్లో  దాదాపు వెయ్యిమందికిపైగా హాజరయ్యారు. 

 

Don't Miss