'జయ' ఆరోగ్యం వదంతులు..

18:19 - December 5, 2016

చెన్నై : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై తీవ్రస్థాయిలో వదంతులు వ్యాపించాయి. ఆమె మృతి చెందిందంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇలాంటి వదంతులు ఎవరూ నమ్మవద్దని అపోలో ఎండీ పేర్కొన్నారు. కొన్ని ఛానెల్స్ నిరాధారణమైన వార్తలు ప్రసారం చేస్తున్నారని, అమ్మ బతికే ఉందని వెల్లడించారు. వైద్యులు జయ ఆరోగ్యాన్ని ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన ఓ ప్రెస్ నోట్ ను అపోలో వైద్యులు వెల్లడించారు. ఎయిమ్స్ నుండి వచ్చిన వైద్యుల పర్యవేక్షణలో జయకు చికిత్స అందించడం జరుగుతోందన్నారు.

ఉద్రిక్తత..
'అమ్మ' కన్నుమూసిందని వదంతులు వ్యాపించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి..ఉద్విగ్నానికి గురయ్యారు. ఆసుపత్రి వద్ద వీరంగం సృష్టించారు. బారికేడ్లు తొలగిస్తూ ఆసుపత్రిలోకి చొచ్చుకొనేందుకు ప్రయత్నించారు. రాళ్లు..చెప్పులు..కుర్చీలు విసురుకుంటూ వెళుతుండడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. లాఠీలకు పని చెప్పడంతో పరిస్థితిని శాంతింప చేసే ప్రయత్నం చేశారు.

ఆదివారం గుండెపోటు..
ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గుండెపోటు రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆసుపత్రి వైద్యులు ఒక ప్రకటన విడుదల చేశారు. జయ పరిస్థితి మరింత విషమంగా ఉందని పేర్కొనడంతో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే కూడా ఇలాంటి విషయాన్నే పేర్కొన్నారు.

 • సెప్టెంబర్ 22 : జ్వరం, డీ హైడ్రేషన్ తో సీఎం జయలలిత ఆసుపత్రిలో చేరారు.
 • సెప్టెంబర్ 24 : జయలలిత సాధారణ భోజనం తీసుకుంటున్నారని అపోలో వైద్యులు వెల్లడించారు.
 • సెప్టెంబర్ 29 : జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. జయ చికిత్సకు బాగా స్పందిస్తున్నారని, కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుందని ప్రకటించారు.
 • అక్టోబర్ 1 : ఆమె ఆరోగ్యంపై వస్తున్న వదంతులను అన్నాడీఎంకే కొట్టిపారేసింది. ఆమె ఆరోగ్యంగానే ఉందని ప్రకటించారు.
 • అక్టోబర్ 2 : అపోలో వైద్యులు లండన్ వైద్యుడు రిచర్డ్ బాలే సహాయాన్ని కోరారు.
 • అక్టోబర్ 6 : ఢిల్లీ ఎయిమ్స్ బృందం అపోలో ఆసుపత్రికి చేరుకుంది.
 • అక్టోబర్ 7 : వెంటిలెటర్ పై ఉన్నట్లు ప్రకటన విడుదలైంది.
 • అక్టోబర్ 21 : జయలలిత కోలుకుంటున్నారని వైద్యుల వెల్లడి.
 • నవంబర్ 3 : జయ పూర్తిగా కోలుకున్నారని అపోలో వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.
 • నవంబర్ 13 : త్వరలోనే జయ విధులు నిర్వహిస్తానని, పూర్తిగా కోలుకున్నట్లు జయ సంతకంతో కూడిన ఓ లేఖ బయటకు వచ్చింది.
 • నవంబర్ 19 : ఐసీయూ నుండి ప్రత్యేక వార్డుకు తరలించినట్లు వైద్యులు పేర్కొన్నారు.
 • నవంబర్ 25 : స్పీకర్ సాయంతో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 • డిసెంబర్ 4 : త్వరలో జయ ఇంటికి వస్తారని అన్నాడీఎంకే ప్రకటించింది. కానీ సాయంత్రమే కార్డియక్ అరెస్ట్ తో ఆమె పరిస్థితి విషమంగా తయారైంది.
 • డిసెంబర్ 5 : ప్రాణాపాయం తప్పినట్లు కేంద్రమంత్రి జేపీ నడ్డా ప్రకటించారు.
 • డిసెంబర్ 5 : ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని వైద్యులు, లండన్ వైద్యుడు రిచర్డ్ ప్రకటించారు.
 • డిసెంబర్ 5 : సాయంత్రం జయ మృతి చెందినట్లు అనధికారికంగా తమిళ న్యూస్ ఛానెల్స్ ప్రసారం చేశాయి.
 • డిసెంబర్ 5 : అపోలో ఆసుపత్రి వద్ద కార్యకర్తలు వీరంగం సృష్టించారు.

 

Don't Miss