గాలికి..డ్రైవర్ తో ఏం లింకు ?

21:21 - December 7, 2016

హైదరాబాద్ : గాలి జనార్దన్‌రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కూతురు పెళ్లికి కావాల్సిన 100 కోట్ల రూపాయల బ్లాక్‌ మనీనీ.. కమీషన్‌ పద్దతిలో వైట్‌గా మార్చుకున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ కమీషన్‌ దందాలో మధ్యవర్తిగా తలదూర్చిన.. ఓ డ్రైవరు.. ఆత్మహత్య నోట్‌ ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. క‌ర్నాట‌కు చెందిన రమేశ్‌గౌడ ఆత్మహ‌త్య ఇప్పుడు మైనింగ్‌ దిగ్గజం గాలిజనార్దనరెడ్డి మెడకు చుట్టుకుంటోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా గాలి జనార్దనరెడ్డి అన్ని కోట్లు ఖర్చు పెట్టి కూతురి పెళ్లి ఎలా చేశాడనే ప్రశ్నకు..రమేశ్‌గౌడ సూసైడ్‌నోట్‌లో సమాధానాలు దొరుకుతున్నాయంటున్నారు. కొందరు మధ్యవర్తుల సాయంతో గాలిజనార్దనరెడ్డి సుమారు వందకోట్ల మేర పాతనోట్లను మార్చుకున్నట్లు ఈ సూసైడ్‌ నోట్‌ ద్వారా తెలుస్తోంది. ఇంతకీ ఎవరీ రమేశ్‌గౌడ..? అతడికీ గాలి జనార్దనరెడ్డికీ సంబంధం ఏంటి..?

2018 ఎన్నికల్లో..
రమేశ్‌గౌడ, కర్నాటక ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి భీమానాయక్‌ దగ్గర డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ భీమానాయక్‌ ద్వారా గాలి జనార్దనరెడ్డి వంద కోట్ల రూపాయల బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకున్నారని.. డ్రైవర్‌ రమేశ్‌గౌడ తన సూసైడ్‌ నోట్‌లో రాశాడు. జనార్దనరెడ్డి కుమార్తె వివాహానికి అవసరమైన మొత్తాన్ని 20శాతం కమిషన్‌ తీసుకుని భీమానాయక్‌ మార్చి ఇచ్చినట్లు ఈ లేఖలో రమేశ్‌గౌడ పేర్కొన్నాడు. అంతేకాదు.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కర్నాటకలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి తనను ఎమ్మెల్యే అభ్యర్థి నిలపాలనీ ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి భీమానాయక్‌ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని రమేశ్‌గౌడ లేఖలో రాశాడు. భీమానాయక్‌తో గాలి జనార్దనరెడ్డి ముఖ్య అనుచరుడు శ్రీరాములు కూడా పలు దఫాలు సమావేశమైనట్లూ లేఖలో పేర్కొన్నాడు. ఈ నోట్ల మార్పిడి క్రమంలో.. తమకు కొంత నగదు తక్కువగా వచ్చిందని గాలి జనార్దనరెడ్డి అనుచరులు తనను వేధించడంతో మనస్తాపానికి గురై.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రమేశ్‌గౌడ తన సూసైడ్‌ నోట్‌లో వెల్లడించాడు.

మలుపులు తిరుగుతుందా ? 
ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు గాలి ఇంట్లో సోదాలు మొద‌లు పెట్టిన త‌ర్వాత డ్రైవ‌ర్ రమేశ్‌కు..గాలి అనుచరుల నుంచి బెదిరింపులు మరీ ఎక్కువ‌య్యాయట. ఆ బెదిరింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రమేశ్ త‌న సూసైడ్ నోట్‌లో తెలిపాడు. డ్రైవర్‌ రమేశ్‌ సూసైడ్ నోట్‌లో రాసినవన్నీ నిజమని తేలితే గాలిని అరెస్ట్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విచారణాధికారులు ఏమేరకు కఠినంగా వ్యవహరిస్తారన్నదానిపైనే ఇది ఆధారపడి ఉంది. రమేశ్‌ సూసైడ్‌ నోట్‌ వ్యవహారం భవిష్యత్తులో ఎన్నెన్ని మలుపులు తిరగనుందో వేచి చూడాలి.

Don't Miss