'అమ్మ' అనారోగ్యానికి కారణాలేంటీ ?

21:18 - December 5, 2016

చెన్నై : అమ్మ జయలలిత ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినడం తమిళనాడు ప్రజలకు అంతుచిక్కని రహస్యం.. ఎప్పుడూ ఆరోగ్యంగా కనిపించే అమ్మ ఇంతటి తీవ్ర అనారోగ్యం పాలవ్వడం ఏంటని తమిళులు చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగానూ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇంతకీ అమ్మ అనారోగ్యానికి కారణాలేంటి...? వాచ్‌ దిస్‌ స్టోరీ. 'అమ్మ' జయలలిత తమిళనాడు ప్రజల ఆరాధ్యదేవత.. అమ్మ మాటే అందరికీ వేదం.. అలాంటి అమ్మ ఆరోగ్యం ఒక్కసారిగా ప్రాణాంతకంగా ఎందుకు మారింది..? ఆరోగ్యం తీవ్రంగా క్షీణించేవరకు అమ్మ ఎందుకు నిర్లక్ష్యం వహించారన్నది ప్రతి ఒక్కరి మదినీ కలచివేస్తోంది.

జయలలిత డయాబెటిక్ పేషెంట్‌..
జయలలిత డయాబెటిక్ పేషంట్‌.. ఎప్పటినుంచో అమ్మను ఈ వ్యాధి వేధిస్తోంది. కానీ డయాబెటిక్ ట్రీట్‌మెంట్ విషయంలో అమ్మ చాలా అశ్రద్ధ చూపించేవారని అత్యంత సన్నిహితులు చెబుతారు. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు తిండి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉండగా భోజనప్రియురాలైన జయలలిత ఆవిషయంలో ఏమాత్రం జాగ్రత్తలు పాటించేవారు కాదు.

ఆప్తులు లేకపోవడంతో మానసిక కుంగుబాటు..
మరోవైపు ఒంటరితనం కూడా అమ్మను తీవ్రంగా కలచివేసిందంటున్నారు. అమ్మకు బాధ వచ్చినా.. సంతోషం వచ్చినా పంచుకోవడానికి కనీసం ఆప్తులు కూడా లేకపోవడంతో మానసికంగా కుంగిపోయేవారన్నది సన్నిహితుల కథనం. దీంతో ఆమె ఆరోగ్యం విషయంలోనూ తీవ్రనిర్లక్ష్యం చూపించేవారని భోగట్టా.

నిత్యం ఏసీ రూముల్లోనే బసచేసే జయలలిత..
అమ్మది భారీ శరీరమైనా ఎప్పుడూ బరువు గురించి ఆలోచించేవారు కాదు. కనీసం బరువును అదుపులో పెట్టుకోవడానికి వ్యాయామం కూడా చేసేవారుకాదు. నిత్యం ఏసీ రూముల్లో బసచేయడం.. ఎప్పుడు కూర్చునే ఉండడం కూడా ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది.

ఊటీ అంటే అమ్మకు అమితమైన ఇష్టం..
ఇవే కాకుండా అమ్మకు శీతల ప్రదేశమైన ఊటీ అంటే చాలా ఇష్టం.. ఏడాదిలో ఆరునెలలు ఊటీలోనే ఉండేవారు. దీంతో జయలలితకు శ్వాసకోశ వ్యాధి కూడా వచ్చింది. ఎప్పుడు ఏసీరూంల్లో ఉండడం... ఎండల్లో తిరగకపోవడం వల్ల ఆమెలో డీ విటమిన్ కూడా లోపించింది. వయసురీత్యానే కాకుండా విటమిన్‌ల లోపం వల్ల కూడా అమ్మకు కాళ్ల నొప్పులు కూడా బాగా పెరిగాయి. దీంతో ఆమె నడవడానికి కూడా బాగా ఇబ్బంది పడ్డారు. ఇటీవల అడుగులో అడుగేయడమే కష్టంగా మారింది.

మిస్టరీగానే అమ్మ ఆరోగ్యం..
ఇన్ని అనారోగ్య సమస్యలున్నా ఎప్పుడు అమ్మ బయటపడేదికాదు. దీనికి కారణం తనకి ఆరోగ్యం బాగలేదని తెలిస్తే తనను నమ్ముకున్న పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఏమైపోతారోననే భయం ఆమెను నిత్యం వెంటాడేది. ఈ కారణంతో ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్‌కు ఆమె నిరాకరించేవారు. ఇంట్లోనే మందులు వాడుతూ వచ్చారు. అందుకే గత సెప్టెంబర్‌ 22న అపోలో ఆస్పత్రిలో చేరేవరకు అమ్మ ఆరోగ్యం ఇంతలా దెబ్బతిందని ఎవరికీ తెలీదు. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మ ఉదాసీనతే ఆమె ఆరోగ్యం తీవ్రంగా విషమించడానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Don't Miss