రాష్ట్రపతి ఎవరో తెలిసేది ఆ రోజే..

19:26 - July 17, 2017

ఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఎన్డీఏ తరఫున రామ్‌నాథ్‌ కోవింద్‌, విపక్షాల నుంచి మీరా కుమార్‌ పోటీ పడుతున్నారు. అధికార, ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అధికార, ప్రతిపక్షాలు అన్న తేడా లేకుండా ఇరువైపుల నుంచి క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు సమాచారం. జులై 20న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజున ఫలితం వెలువడనుంది. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోది, బిజెపి చీఫ్‌ అమిత్‌షా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, రాహుల్‌గాంధీ, అద్వాని, కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

32 పోలింగ్ కేంద్రాలు..
రాష్ట్రపతి ఎన్నికల కోసం 32 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంపీలు పార్లమెంట్‌లో, ఎమ్మెల్యేలు తమ తమ అసెంబ్లీలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాల్లోనే ఓటు వేయాల్సి ఉండగా ఈసీ ముందస్తు అనుమతితో 55 మంది ఎంపీలు, నలుగురు ఎమ్మెల్యేలు తమకు అందుబాటులో ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేశారు. గుజరాత్‌లో ఎమ్మెల్యేగా ఉన్న బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా పార్లమెంట్‌లో ప్రధాని మోదితో కలిసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

4896 సభ్యులు..
రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు మొత్తం 4896 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో 4,120 మంది శాసనసభ్యులు కాగా...776 మంది పార్లమెంట్‌ సభ్యులున్నారు. మొత్తం ఓట్ల సంఖ్య 10 లక్షల 98 వేల 903 ఓట్లు. నామినేటెడ్‌ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఓటుహక్కు ఉండదు. ఫలానా అభ్యర్థికే ఓటు వేయాలని ఏ పార్టీ కూడా తమ సభ్యులకు విప్‌ జారీ చేయడం కుదరదు. దీంతో పలు రాష్ట్రాల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు సమాచారం.

25న ప్రమాణ స్వీకారం..
రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఎన్డీయే పక్షాలతో పాటు బిజెడి, టిఆర్‌ఎస్‌, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్, ఎఐఎడింకెలో ఓ వర్గం మద్దతు ప్రకటించాయి. మీరా కుమార్‌కు కాంగ్రెస్‌తో పాటు ఆర్జేడి, ఎస్పీ, బిఎస్పీ వామపక్షాలు తదితర 17 ప్రతిపక్షపార్టీలు మద్దతు తెలిపాయి. మొదటి నుంచి మీరా కుమార్‌కు మద్దతు తెలిపిన ఎన్‌సిపి చివరి క్షణంలో ఎన్డీయే అభ్యర్థి కోవింద్‌వైపు మొగ్గడం గమనార్హం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ విజయం తథ్యమని తెలిసినా...పోటీలో ఉండాలనే ఉద్దేశంతో విపక్షాలు మీరా కుమార్‌ను రంగంలోకి దింపాయి. రామ్‌నాథ్‌ కోవింద్‌ 63 శాతానికి పైగా ఓట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది. జులై 20న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజున ఫలితం వెలువడనుంది. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం జులై 24తో ముగుస్తుంది. కొత్త రాష్ట్రపతిగా జులై 25న ప్రమాణ స్వీకారం చేస్తారు.

Don't Miss