'ప్రగతి నివేదన' సభ...హైకోర్టులో విచారణ...

06:32 - August 31, 2018

హైదరాబాద్ : టీఆర్‌ఎస్‌ తలపెట్టిన ప్రగతి నివేదన సభకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సెప్టెంబర్‌ 2న జరుపనున్న భారీ బహిరంగ సభ వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులతోపాటు పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు , న్యాయవాది అయిన పూజారి శ్రీధర్‌ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రగతిని నివేదించాలనుకుంటే అనేక ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని పిటిషనర్‌ తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులో ఉన్నందున 4జీ లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వివరించవచ్చని పిటిషన్‌లో సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్న కారణంగా గతంలో ఇందిరాపార్కు, విశ్వవిద్యాలయాల్లో పలు సభల నిర్వహణకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం... ఇప్పుడెలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తోందని ప్రశ్నించారు. సభ పేరిట టీఆర్‌ఎస్‌ సర్కార్‌ కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తోందని పిటిషనర్‌ ఆరోపించారు. ప్రగతి నివేదన సభకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్‌ కోరారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరుగనుంది.

Don't Miss