అమ్మ మృతిపై ప్రముఖుల సంతాపం..

09:56 - December 6, 2016

తమిళనాడు : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూతపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయలలిత మృతితో దేశం ఒక శక్తివంతమైన నాయకురాలని పోల్పోయిందని సంతాప సందేశాల్లో పేర్కొన్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన నేతను కోల్పోవడం దురదృష్టకరమంటూ సానుభూతి తెలిపారు.

జయలలిత కృషి ఆదర్శనీయం : ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి
జయలలిత కన్నుమూతపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ ద్వారా విచారం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రజలకు సానుభూతి తెలియజేశారు. జయలలితతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజలు, పేదల సంక్షేమానికి ఈమె చేసిన కృషి ఆదర్శనీయమన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి తమిళనాడు ప్రజలకు భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, జయ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

దేశం ఒక రాజకీయ ధృవతారను కోల్పోయింది : రాష్ట్రపతి ప్రణబ్
జయలలిత మరణంతో దేశం ఒక రాజకీయ ధృవతారను కోల్పోయిందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ సంతాపం ప్రకటించారు. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న మహానాయకురాలని పేర్కొన్నారు. జయలలిత మృతి దేశానికి తీరని లోటని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా సంతాపం వ్యక్తం చేశారు.

జయలలిత మహోతన్న నాయకురాలు : రాహుల్

భారత రాజకీయాల్లో జయలలిత మహోతన్న నాయకురాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన సంతాప సందేశంలో పేర్కొర్నారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న మహానాయకురాలని, జయలలిత మరణం దేశానికి తీరనిలోటని సంతాపం ప్రకటించారు.

జయలలిత పెదల పెన్నిధి : పలు సీఎంలు
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు సంతాపం ప్రకటించారు. జయలలిత పెదల పెన్నిధి అని కేజ్రీవాల్‌ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. జయలలిత అత్యంత ప్రజాదరణ పొందిన, జనాకర్షణ కలిగిన నాయకురాలని నిజాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే సమర్థవంతమైన నాయకురాలని మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు.

రాజకీయాల్లో రాజీలేని జయలలిత : కనిమొళి
డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, ఆ పార్టీ ఎంపీ కనిమొళి.... జయలలిత మృతికి సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లో రాజీలేని ధోరణి అవలంభించిన జయలలిత మరణంతో ప్రత్యేక గుర్తింపు, ప్రతిభావంతమైన నాయకురాలిని కోల్పోమయని సంతాప సందేశంలో పేర్కొన్నారు. క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, నటుడు సిద్ధార్థ జయలలిత మృతికి సంతాపం ప్రకటించారు.

Don't Miss