తుది దశకు మియాపూర్ భూకుంభకోణ విచారణ

17:47 - December 25, 2017

హైదరాబాద్ :మియాపూర్ భూవివాదం కేసు చివరిదశకు చేరుకుంది. మియాపూర్ భూవివాదం కేసులో కూకట్‌పల్లి సైబరాబాద్ పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్‌ స్టాంప్స్‌ శాఖ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

భూమి తెలంగాణ ప్రభుత్వానిదే...
కూకట్‌పల్లి, మియాపూర్‌ భూములు తమ పూర్వీకులదంటూ.. నిజాం కుటుంబ సభ్యులు కోర్ట్‌లో పిటిషన్‌ వేశారు. ఇక కబ్జా చేసిన ట్రినిటి కంపెనీ, సువిశాల్‌ కంపెనీలు సైతం వ్యవసాయ భూములుగా నకిలీ డాక్యుమెంట్స్‌ను సృష్టించి తమదంటూ కోర్టులో వాదించారు. ఇరువురి వాదోపవాదనలు విన్న కోర్టు.. 814 ఎకరాల విలువైన భూమి తెలంగాణ ప్రభుత్వానిదేనని తీర్పు ఇచ్చింది. కూకట్‌ పల్లి, మియాపూర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌లో కంపెనీలు సృష్టించిన నాలుగు పాస్‌ పుస్తకాలు, ట్రాన్స్‌ఫర్‌ డాక్యుమెంట్స్‌తో పాటు సేల్‌డీడ్‌, ఫేక్‌ రిజిస్ట్రేషన్‌ ఆధారాలను పోలీసులు సేకరించారు. ఈ వ్యవహరంలో పోలీసులు అనేక అంశాలను పరిశీలించారు. నిందితుల బెయిల్ పిటిషన్‌ను మియాపూర్ కోర్టు డిస్మిస్ చేసింది. నిందితులను కోర్టు అనుమతితో కస్టడిలోకి తీసుకొని పోలీసులు ఈ కేసును మరింత వేగంగా దర్యాప్తు జరిపారు.

వ్యవసాయ భూములుగా చూపిస్తూ
మియాపూర్‌ ప్రభుత్వ భూములను వ్యవసాయ భూములుగా చూపిస్తూ సువిశాల్‌, ట్రినిటీ కంపెనీలు అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. భూకబ్జాలకు పాల్పడిన నిందితులు పార్థసారధితో పాటు సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్ మరికొందరు గతంలో అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈకేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. తాజాగా ఈ కేసులో అన్ని ఆధారాలు, వివరాలతో కూకట్‌పల్లి పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేయనుండడంతో ఈకేసు చివరి అంకానికి చేరుకుంది. ఈ కేసులో అన్ని ఆధారాలు పక్కాగా సేకరించిన పోలీసులు.. త్వరలో ఛార్జిషీట్‌తో పాటు సాక్షులను కోర్టు ముందు హజరుపరుచనున్నారు.

Don't Miss